పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ : కలెక్టర్‌

May 15,2024 00:52

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు జిల్లా మొత్తం 144 సెక్షన్‌ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగడంపై ఉన్నతాధికారులు స్పందించారు. కారంపూడి మండలం పేటసన్నిగండ్లలో మంగళవారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లా ఎస్‌పి బిందుమాధవ్‌ గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాచర్లలోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. పల్నాడులో జరిగిన ఘర్షణలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డిజిపి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా పల్నాడుకు అదనపు బలగాలు పంపినట్టు తెలిపారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు ఘర్షణకు అవకాశం ఉన్న గ్రామాలకు తక్షణం కేంద్ర బలగాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పేటసన్నిగండ్ల గ్రామానికి కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి.

➡️