16న కార్మిక సమ్మెను జయప్రదం చేయండి

Feb 12,2024 20:12

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈనెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనివిజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం అమర్‌భవన్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్‌, ఐఎన్‌టియుసి నాయకులు మొదిలి శ్రీనివాసరావు, ఎఐఎఫ్‌టియు నాయకులు బెహరా శంకరరావు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి కార్పొరేట్‌ మతతత్వ విధానాలను అమలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్‌ నిర్వహించాలని జాయింట్‌ ఫ్లాట్‌ ఫారం ఆఫ్‌ క్రియేట్‌ యూనియన్స్‌, సంయుక్త కిషన్‌ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో కార్మికులంతా సమ్మె చేయాలని, గ్రామాల్లో బంద్‌ చేపట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి అవకాశాలు మృగ్యమైపోయాయని, శ్రామికుల నిజవేతనాలు 20శాతం తగ్గిపోయాయని తెలిపారు. గత ఏడాది కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయడం అన్యాయం అన్నారు స్విస్‌ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేస్తామన్న మాటను పూర్తిగా మర్చిపోయారని అన్నారు. మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు పూర్తిగా నాశనం అయ్యాయని అన్నారు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌ లను తీసుకువచ్చి కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందన్నారు అన్ని రంగాల్లోను కాంట్రాక్ట్‌ లేబర్‌ విధానం పెంచి శ్రమ దోపిడీకి గురిచేస్తోందన్నారు. కనీస వేతనం నెలకు 26 వేలు నిర్ణయించేందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించటం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాల మతతత్వ ధోరణులకు నిరసనగా ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ ర్యాలీలో రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఎస్‌.గంగరాజు, బి.రమణ, ఆనంద్‌, పొడుగు రామకృష్ణ, ఎన్‌ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

➡️