16న గ్రామీణ బంద్‌కు ఎల్‌ఐసి ఉద్యోగుల మద్దతు

Feb 10,2024 00:14

సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు
ప్రజాశక్తి-గుంటూరు : రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, యువతకు ఉపాధి అవకాశాల పెంపుదల, కార్మికులకు కనీస వేతనాలు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, పాత పెన్షన్‌ స్కీం పునరుద్ధరణ, 14 శాతం పిఎఫ్‌ వాటా యాజమాన్యాలు చెల్లించడం, ఎల్‌ఐసిలో నూతన నియామకాలు, ప్రీమియంలపై జీఎస్టీ రద్దు తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా పరిష్కరించాలని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు జే.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా జరిగే గ్రామీణ సమ్మెకు మద్దతుగా శుక్రవారం గుంటూరులోని ఎల్‌ఐసి కార్యాలయాల వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. అరండల్‌పేటలోని ఎల్‌ఐసి ఆఫీసు వద్ద జరిగిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్రం ఈ తొమ్మిదేళ్లలో చొరవేమీ చూపలేదని అన్నారు. తొమ్మిదేళ్లలో సుమారు లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల రుణమాఫీ చేయని ప్రభుత్వం, కార్పొరేట్లకు మాత్రం రూ.15 లక్షల కోట్ల పన్ను రాయితీలు ఈ కాలంలో ఇచ్చిందని విమర్శించారు. తాజా బడ్జెట్లో ఉపాధి కల్పనకు, కార్మికులకు కనీస వేతనాలకు సంబంధించి, పాత పెన్షన్‌ స్కీం పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని అన్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం బీమా ప్రీమియంపై జిఎస్టిని తగ్గించాలని సూచించిందని, అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని చెప్పారు. కార్మిక వర్గం, రైతులు ఫిబ్రవరి 16న చేస్తున్న దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ మచిలీపట్నం డివిజన్‌ సంయుక్త కార్యదర్శి వివికె సురేష్‌, జి.శివరామకృష్ణ, ఆర్‌.వి.ఎస్‌. శ్రీనివాస్‌, ఐ.వెంకట్రావు, పి.శ్రీదేవి, సి.శేషుకుమారి, కె.రాజేశ్వరి, ఎమ్‌.రాఘవ, పి.అరుణకుమారి పాల్గొన్నారు.

➡️