16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న శివ నాగరాణి

పల్నాడు జిల్లా:  సంయుక్త కిసాన్‌ మోర్చా, అఖిలభారత ట్రేడ్‌ యూనియన్ల సమైక్య పిలుపు మేరకు ఈ నెల 16న ఐదు రైతు సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివనాగ రాణి పిలుపునిచ్చారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు కారుచోల రోశయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శివ నాగరాణి మాట్లాడుతూ ఈ బంద్‌లో వ్యవసాయ కూలీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఉపాధి హామీకి బడ్జెట్‌లో తగ్గించిన నిధులను, పని దినాలను పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పల్నాడు జిల్లాలో కరువు ఛాయలు అలముకున్నాయని, వ్యవసాయ కూలీలు పనులు లేక అర్దాకలితో అలమటిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలలో భరోసా నింపాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కూలీలు వలసలు వెళ్లడం వలన వారి పిల్లల చదువు దెబ్బతింటుందని వలసలు వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని వలస ప్రాంతాల్లో బాని సత్వంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తక్షణమే ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు పనులు 200 రోజుల పని దినాలు కల్పిం చాలని రూ.600 వేతనం ఆహార భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుమల లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకం బడ్జెట్‌ లో నిధులు పెంచి ఆదుకోవాలని, వలసలు నివారించేందుకు కృషిి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కొమ్ముల నాగేశ్వరరావు, సాతులూరి లూధర్‌, దావల అన్నపూర్ణ, జడ రాజకుమార్‌, గంటెల చిన్నప్ప, ఏపూరి వెంకటేశ్వర్లు, కంచర్ల నాగేశ్వరరావు, పఠాన్‌ సైదా ఖాన్‌, ఈ ఊరి లక్ష్మారెడ్డి, పెనుమాల ఆశీర్వాదం, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️