16న నిరసనను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని, ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక, రైతు, వ్యవ సాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు ఎ.రామాంజులు, సిరిపురి రామచంద్ర, డి.భాగ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని చెప్పారు. ఒకవైపున పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ధరలను విపరీతంగా పెంచేసి ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పొరేట్‌ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతుందని విమర్శించారు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు కల్పించిన నరేంద్ర మోడీ రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాల రాశారని మండిపడ్డారు. అదానీ అంబానీలను కుబేరులను చేసి, రైతులను, వ్యవసాయ కార్మికులను అప్పులు పాలు చేశారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మూడు నల్ల చట్టాలు తీసుకు వచ్చారన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చారన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న కేంద్ర బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం అవ్వాలన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు 50 శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసేం దుకు రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు పెంచి, వేతనం రూ.600 ఇవ్వాలన్నారు. ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కరువు తుపాన్‌ నష్టపరిహారాలను ఇన్‌పుట్‌ సబ్సిడీలను రైతులకు వెంటనే ఇవ్వాలని చెప్పారు. రైతులందరికీ పంటల బీమా కల్పించాలని కోరారు. 16న జరిగే దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ ప్రాంత బంద్‌ జయప్రదం కోసం జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు సదస్సులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు అరుణ, సురేఖ, ఇర్షాద్‌, రమీజా, తహరున్నీసా, లక్ష్మిదేవమ్మ పాల్గొన్నారు

➡️