అనంతగిరి మండల సర్వసభ్య సమావేశం
చట్టసవరణ ఆలోచనపై ఎంపీ తనూజారాణి ఆగ్రహం
మైదాన ప్రాంతాలకు ఇసుక తరలిస్తే కఠిన చర్యలు : జెడ్‌పిటిసి
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలకు ఆదేశం
ప్రజాశక్తి- అనంతగిరి రూరల్: గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం పటిష్ట అమలుకు చర్యలు చేపట్టాలని అనంతగిరి మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. సోమవారం స్థానిక ఎంపిపి శెట్టి నీలవేణి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనుల గుండెకాయ లాంటి భూబదలాయింపు నిషేధ 1/70 చట్టంలో సవరణలు చేయాలన్నా ఆలోచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిఒ 3 రద్దుతో అనేక హక్కులు, అధికారాలకు దూరమైన గిరిజనులకు, 1/70 చట్టం కూడా లేకుండా చేయాలన్న కుట్రలు దుర్మార్గమన్నారు. జిఒ 3 ప్రయోజనాలను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఆ ఊసెత్తడం లేదన్నారు 1/ 70 చట్ట సవరణ ఆలోచన విరమించుకోకుంటే, పార్లమెంట్ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు.అధికారుల గైర్హాజరుపై జెడ్‌పిటిసి ఆగ్రహంమండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి కేవలం నాలుగు శాఖలు మినహాయించి, మిగిలిన శాఖల మండలాధికారులు గైర్హాజరుపై సిపిఎం జెడ్‌పిటిసి గంగరాజు అగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు సమయపాలన పాటించడం లేదని, విధులకు డుమ్మా కొడుతున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు బాధ్యత యుతంగా పనిచేయకపోతే మండల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కాశీపట్నం గోస్తనీ గెడ్డ, ఎర్రిగడ్డ, వెంకయ్య పాలెం చిలకల గెడ్డ, గుమ్మ కోట ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిపోతోందని, దాన్ని అరికట్టాలని తహశీల్దార్‌కు ఆదేశించారు. తహశీల్దార్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణం తగు చర్యలు చేపట్టాలని సూచించారు. రైల్వే శాఖ, ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు ఇసుక అక్రమంగా తరలిస్తే తహశీల్దార్‌పై చర్యలు తీసుకోక తప్పదని ఎంపీ హెచ్చరించారు. గిరిజనుల ఇల్లు నిర్మాణానికి మాత్రమే ఉచితంగా ఇసుకను ఇవ్వాలని, కాంట్రాక్టు పనులకు తగిన ధరకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తహశీల్దార్‌పై ఉందన్నారు.రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి జాడలేకపోవడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం సర్పంచ్ కిలో మొస్య, అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ తనుజరాణి