18 నుంచి 25 వరకు నామినేషన్లు

ప్రజాశక్తి-పర్చూరు: ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికల నామినేషన్లను స్వీకరించ నున్నట్లు పర్చూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జి రవీందర్‌ తెలిపారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలవు దినాల్లో తప్ప ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఒక్కొక్కరు నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఈనెల 29న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు. మే 13వ తేదీన పోలింగ్‌ జరగనున్నట్లు ఆయన వివరించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ కింద ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ కింద ఇప్పటివరకు నియోజకవర్గంలో 101 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మార్టూరులో 20, పర్చూరులో 29, కారంచేడులో 2, ఇంకొల్లులో 33, యద్దనపూడిలో 16, చిన్నగంజాంలో ఒక కేసు నమోదు అయినట్లు ఆయన వివరించారు. ఇప్పటివరకు అనుమతి లేకుండా తరలిస్తున్న రూ.8,27,540/- నగదుని సీజ్‌ చేసినట్లు ఆయన వివరించారు. నగదు తరలింపుకు సంబంధించి మార్టూరులో మూడు కేసులు, చిన్నగంజాంలో ఒక కేసు నమోదు అయినట్టు ఆయన వివరించారు. ఎన్నికల ప్రచారంలో అన్ని అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులను కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బాపట్ల డిఎస్పి మురళీకృష్ణ తెలిపారు. అందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో 62 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వాటి పట్ల ప్రత్యేక దష్టి సారించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో పర్చూరు తహశీల్దార్‌ సుబ్బయ్య, సీఐ సీతారామయ్య, పర్చూరు ఎస్సై రమేష్‌, యద్దనపూడి ఎ జీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

➡️