ప్రజాశక్తి – కడప ప్రతినిధి ప్రభుత్వం ఇటీవలి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో జిల్లా నీటి పారుదల శాఖ విభాగానికి రూ.2,130 కేటాయించింది. ఉమ్మడి కడప జిల్లాలోని 14 ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసింది. రూ.1300 కోట్లు ప్రాజెక్టు పనులకు, రూ.830 కోట్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు పద్దును కేటాయించింది. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ముంగిట జిల్లా నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన రూ.2,130 కోట్ల పద్దును యథాతథంగా ఆమోదించడం పట్ల ఇంజినీరింగ్ అధికారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ యంత్రాంగం జిల్లాలో గతంలో చేసిన అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల ప్రతిపాదనల తరహాలో మిగిలిన జిల్లాలకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదించక పోవడమే యథాతథ ఆమోదానికి కారణమనే వాదన వినిపిస్తోంది. అత్యధికంగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పిబిసి)కు రూ.330 కోట్లు కేటాయించింది. రూ.200 కోట్లు ప్రాజెక్టు పనులకు, మిగిలిన రూ.130 కోట్లను ఇంజినీరింగ్ యంత్రాంగం జీతభత్యాలకు వ్యయం చేయనుంది. గండికోట నిర్వాసితుల పరిహారం చెల్లింపులకు రూ.78 కోట్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన తెలుగుగంగ ప్రాజెక్టు రూ.430 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. తెలుగుగంగ ప్రాజెక్ట్సులో అంతర్భాగమైన బ్రహ్మసాగర్ రిజర్వాయర్ అభివృద్ధి పనులకు రూ.ఆరు కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. కడప జిల్లాలోని బుగ్గవంక, అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రధాన రిజర్వాయర్లుగా పరిగణ పొందిన అన్నమయ్య రిజర్వాయర్ ఇన్వెస్టిగేషన్ బిల్లు చెల్లింపులకు రూ.78 లక్షలు, వెలిగల్లు, రూ.100 కోట్ల వ్యయంతో కూడిన ఎత్తిపోతల పనులకు ఎటువంటి కేటాయింపులు చేలేదు.
