ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రస్తుత వేసవి సీజనులో జిల్లాలో నిర్మాణ రంగ అవసరాలకు సరిపడేంతగా నిరంతరాయంగా ఇసుక సరఫరాకు సిద్ధంగా వుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాలు, ప్రజావసరాల కోసం, ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల నిర్మాణాల కోసం 2.86 లక్షల ఇసుక సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా స్థాయి ఇసుక సరఫరా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం కుసుమూరు, కె.వెంకటాపురం ఇసుక రీచ్‌ల ద్వారా 89 వేల టన్నులు లభ్యమవు తుందని, రేగిడి ఆమదాల వలస మండలంలోని బొడ్డవలస, శ్రీకాకుళం జిల్లా తోటపాలెం వద్ద గల మేడమర్తిలో మరో రెండు ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అవకాశం ఉందని, రెండు పాయింట్ల ద్వారా మరో 1.97 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలకు 10వేల టన్నులు, వైద్య కళాశాల నిర్మాణ అవసరాలకు 10వేల టన్నుల ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ తదితర ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణ పనులకు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు కూడా అవసరమైన మేరకు ఇసుక సరఫరా చేయాలని సూచించారు. పోలీసులు సీజ్ చేసిన ఇసుకను గృహనిర్మాణ శాఖకు అందజేయాలని అదనపు ఎస్‌పికి కలెక్టర్ సూచించారు. జెసి ఎస్.సేతు మాదవన్, అదనపు ఎస్‌పి సౌమ్యలత, ఆర్‌డిఒ కీర్తి, జిల్లా గనులశాఖ అధికారి మోహనరావు, ఉప రవాణా కమిషనర్ మణికుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ సరిత, హౌసింగ్ పీడీ మురళి, భూగర్భశాఖ డిడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
