ప్రజాశక్తి-బేస్తవారిపేట: వికలాంగుల కోసం 2016వ సంవత్సరంలో తెచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిద్దలూరు నియోజకవర్గ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోలూరు వెంకటస్వామి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం సమర్పించారు. శనివారం బేస్తవారిపేట మండలంలోని చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం తెచ్చిన చట్టం సరిగా అమలు జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ చట్టం అమలుకు మంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారని, ఈ రిజర్వేషన్లు ప్రైవేటు రంగంలోనూ అమలు చేయాలని పేర్కొన్నారు. వికలత్వం ఉండి పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్లకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేపట్టిన వికలాంగుల పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.
