ప్రకాశంలో 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం – ముగ్గురు అరెస్టు

కొమరోలు (ప్రకాశం) : ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 28 ఎర్రచందనం దుంగలతోపాటు, ఒక కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు శుక్రవారం వివరాలను వెల్లడించారు.  టాస్క్‌ ఫోర్స్‌ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు ఐపీఎస్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్‌ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు కడప సబ్‌ కంట్రోల్‌ ఆర్‌ఐ చిరంజీవులుకు చెందిన ఆర్‌ఎస్‌ఐ నరేష్‌ టీమ్‌, అటవీ సిబ్బంది సహకారంతో గురువారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్‌ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళ్లారు. నిన్న అర్ధరాత్రి ప్రకాశం టెరిటోరియల్‌ ఫారెస్టు డివిజన్‌ బెస్తవారి పేట రేంజి తాటిచెర్ల సెక్షన్‌, నల్లకుంట్ల అటవీ బీటు పరిధిలోని అక్కాపల్లి చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒక కారు నిలిచి ఉండగా, అందులో ఎర్రచందనం దుంగలను కొందరు లోడ్‌ చేస్తూ కనిపించారు. దీంతో వారిని టాస్క్‌ ఫోర్సు సిబ్బంది చుట్టుముట్టగా, వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకోగలిగారు. కింద 11 దుంగలు, కారులో 17 దుంగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్‌ కు చెందిన పేరం రామరాజు (44), సంచర్ల పంచాయితీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య (25), క్రిష్ణంశెట్టి పల్లి మండలం షేక్‌ ఖాసిం (43)లుగా గుర్తించారు. పేరం రామరాజు అనే వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఈ కేసును తిరుపతి టాస్క్‌ ఫోర్సు పోలీసు స్టేషన్‌ లో నమోదు చేయగా, సీఐ సురేష్‌ కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

➡️