వ్యర్థాల నిర్వహణపై 28న గీతంలోఅంతర్జాతీయ సదస్సు

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

27న స్కూల్‌ చిల్డ్రన్‌ కాంగ్రెస్‌, హ్యక్‌థాన్‌

ప్రజాశక్తి -మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎయిర్‌ అండ్‌ వాటర్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యాన ఈనెల 28 నుంచి వచ్చేనెల ఒకటి వరకు వ్యర్ధాల నిర్వహణ, సర్క్యులర్‌ ఎకానమీపై 14వ అంతర్జాతీయ సదస్సును గీతం వర్సిటీలో నిర్వహించనున్నట్లు సదస్సు చైర్మన్‌ ప్రొఫెసర్‌ సాధన్‌ కె ఘోష్‌ తెలిపారు. మంగళవారం సదస్సు కన్వీనర్లు, గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్‌ సాయిసుధాకర్‌, డాక్టర్‌ సౌదామినిలతో కలసి విలేకర్లతో మాట్లాడుతూ, వివిధ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలతోపాటు రోజువారి జీవితంలో వినియోగించే ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌, ఆసుపత్రి వ్యర్ధాలను రీసైక్లింగ్‌ పద్దతులతో పునర్వినియోగానికి తెచ్చి, కొత్త ఆర్ధిక వ్యవస్థను సృష్టించడాన్ని సర్క్యులర్‌ ఎకానమీ అంటారన్నారు. సస్టైనబుల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, సర్క్యులర్‌ ఎకానమీ, ఐపిఎల్‌ఎ గ్లోబల్‌ ఫోరమ్‌-2024 పేరిట జరిగే సదస్సులో 60 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు హజరు కానున్నారని, వివిధ రంగాల నిపుణులు 580 పరిశోధన పత్రాలను సమర్పించనున్నారని తెలిపారు. ఈజిప్ట్‌, నార్వే, జపాన్‌, అమెరికా దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు కీలక ఉపాన్యాశాలు చేస్తారన్నారు. సదస్సులో భాగంగా ఈనెల 27న నిర్వహించే స్కూల్‌ చిల్డ్రన్‌ కాంగ్రెస్‌లో దేశంలోని 25 పాఠశాలల నుంచి 200 మంది విద్యార్ధులు హజరు కానున్నారని వెల్లడించారు. వ్యర్ధ పదార్ధాల నిర్వహణలో సరికొత్త పద్దతులను, వాణిజ్య సమూనాలను ఉపయోగిస్తున్న పరిశ్రమలకు, స్వఛ్చంద సంస్థలకు అవార్డులను అందజేస్తామన్నారు. సదస్సులో భాగంగా పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. వ్యర్ధాలను సమర్ధంగా నిర్వహించిన ప్రపంచంలోని 52 సంస్థలకు సదస్సులో అవార్డులు అందించనున్నామని సదస్సు చైర్మన్‌ ప్రొఫెసర్‌ సాధన్‌ కె ఘోష్‌ తెలిపారు. వ్యర్ధాల నిర్వహణపై విశేష కృషి, పరిశోధనలు జరుపుతున్న వ్యక్తులను గుర్తించి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను అందజేస్తామన్నారు. సదస్సు తీర్మానాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

➡️