త్వరలో 3 కొత్త క్రికెట్‌ అకాడమీలు

Nov 8,2024 00:24

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : రాష్ట్రంలో మూడు క్రికెట్‌ అకాడమీలు పెట్టబోతున్నామని, ఇందులో అనంతపురంలో మహిళా అకాడమీ, విజయనగరంలో మెన్స్‌ అకాడమీ, విజయవాడ మూలపాడు స్టేడియంలో సీనియర్‌ మెన్స్‌ అకాడమీలు ఉంటాయని ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌ తెలిపారు. బెంగుళూర్‌లో బిసిసిఐ ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్స్‌ సెంటర్‌ తరహాలో ఈ మూడు క్రికెట్‌ అకాడమీలు ఉంటాయని చెప్పారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ మంగళగిరి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం కార్యాలయంలో శివనాథ్‌ అధ్యక్షతన ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ గురువారం జరిగింది. మంగళగిరి క్రికెట్‌ స్టేడియం అభివృద్ధితో పాటు, రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి సంబంధించి 16 అంశాలపై చర్చించారు. మంగళగిరి క్రికెట్‌ స్టేడియం నిర్మాణంలోని లోపాలను సరిచేసేందుకు అహ్మదాబాద్‌ నరేంద్రమోదీ ఇంటర్నేషనల్‌ స్టేడియంకు పనిచేసిన పాపుల్యస్‌ చెన్నైకి చెందిన ఎన్‌.వి అసోసియేట్స్‌ ఆర్కిటెక్చర్‌ కంపెనీలతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో శివనాథ్‌ మాట్లాడుతూ క్రీడా సదుపాయలు లేని గ్రామీణా ప్రాంతాల్లోనూ గ్రౌండ్స్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వీరు ఐపిఎల్‌లో, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో సెలెక్ట్‌ అయ్యేలా కొత్త అకాడమీల్లో శిక్షణిప్పిస్తామని చెప్పారు. రాబోయే ఐపిఎల్‌ మ్యాచుల్లో ఏపీ నుంచి 20 మంది ఎంపికయ్యేలా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌తో శిక్షణ ఇప్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్‌లు రాష్ట్రంలోనూ జరుగుతాయని, అందుకు వైజాగ్‌ స్టేడియన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్‌ టోర్నమెంట్‌లు పెంచే యోచనలో ఉన్నామన్నారు. అండర్‌-19 క్రికెట్‌ టోర్నమెంట్‌లు కూడా తీసుకు రాబోతున్నట్లు చెప్పారు. సౌత్‌ ఇండియాలో వున్న రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్స్‌తో మాట్లాడి ఇంకా టోర్నమెంట్స్‌ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయనగరం, వైజాగ్‌, విజయవాడ, మంగళగిరి, అనంతపురం కడప స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. మంగళగిరి క్రికెట్‌ స్టేడియంలో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు వీలుగా కృషి చేస్తున్నామన్నారు. ఈ స్టేడియం 12 ఏళ్ల క్రితం డిజైన చేసిన దృష్ట్యా నిర్మాణంలో చాలా లోపాలున్నాయని, పార్కింగ్‌ సదుపాయం లేదని చెప్పారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం పార్కింగ్‌కు బిసిసిఐ నిబంధనలు ప్రకారం 14 ఎకరాలు ఉండాలన్నారు. ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు జరగాలంటే మంచి స్పోర్ట్స్‌ సెంటర్‌ వుండాలని తెలిపారు. వీటిన్నింటీకి 35 ఎకరాలు అవసరం కాగా ఇప్పటికే ప్రభుత్వానికి, సిఆర్‌డిఎకు విజ్ఞప్తి చేశామని, ఇవ్వటానికి వారు సిద్ధంగా వున్నారని తెలిపారు. స్టేడియం మార్గంలో రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. నాలుగు నెలల్లో వెస్ట్రన్‌ బైపాస్‌ పూర్తవుతుందని, ఆ బైపాస్‌ నుంచి స్టేడియంకు రోడ్‌ వచ్చే విధంగా ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. స్టేడియంకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ లింక్‌ చేసేలా కృషి చేస్తున్నామన్నారు. మంగళగిరి-నిడమర్రు రైల్వే గేట్‌ దగ్గర నాలుగు వరుసల ఆర్‌.వో.బి ప్రతిపాదనలు పెట్టామన్నారు. స్టేడియం సిద్ధమయ్యేలోగా ఇవన్నీ పూర్తవుతాయని చెప్పారు. సమావేశంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.వెంకట రామ ప్రశాంత్‌, సెక్రెటరీ సానా సతీష్‌, కోశాధికారి దండమూడి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ దంతుగౌరు విష్ణు తేజ్‌ పాల్గొన్నారు.

➡️