ప్రజాశక్తి- మాచర్ల : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్న పేషంట్ల సంఖ్య తగ్గించేందుకు అన్ని వైద్యశాలల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల జిల్లా అధికారి రంగారావు తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన ఆయన డాక్టర్లతో సమీక్షించారు. పేషంటు జిల్లా వైద్యశాలకు రిఫర్ చేయకుండా తగిన చికిత్స ఇక్కడే అందేలా అవసరమైన ఏర్పాట్లపై సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య సహాయం అందించకుండా అనవసరంగా జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిని 100 పడకల స్థాయికి పెంచేందుకు ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే చర్చింస్తుండగా ఆస్పత్రికి గతంలో ఉన్న ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెెండెంట్ డాక్టర్ ఉదయభాను, డాక్టర్లు కెపి చారి, దినేష్, ప్రకాష్, సురేష్ పాల్గొన్నారు.