Dec 7,2024 01:22

ఎర్రజెండాకే పోరాడే సత్తా
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి/పల్నాడు జిల్లా :
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేశక్తి ఎర్ర జెండాకే ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. ఆ పార్టీ పల్నాడు 25వ జిల్లా మహాసభ జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు పట్టణంలో భారీర్యాలీ, పల్నాడు బస్టాండ్‌ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ అధ్యక్షత వహించగా బాబూరావు మాట్లాడారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయపోవడం వల్ల తమ పార్టీ పోరుబాట పట్టిందన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సిపిఎం, ఎర్రజెండా ఉంటాయన్నారు. వైసిపి ప్రభుత్వంలో ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని బాదుడే..బాదుడు అంటూ ఉపన్యాసాలు చెప్పిన చంద్రబాబు అప్పుడే రెండు సార్లు ఛార్జీల పెంపునకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి దాసోహం ప్రజలపై అంటూ కూటమి భారాలేస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, డిఎస్‌సి నోటిఫికేషన్‌ వెంటనే ఇస్తామని తొలి సంతకం చేసి ఆరు నెలలైనా ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, దానిపైనా మాట్లాడటం లేదని విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో సిమెంట్‌ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని భూములు తీసుకున్న అధినేతలపై చర్యలు లేవన్నారు. రైతుల పిల్లలకు ఉద్యోగాలిస్తామని భూములు 20 ఏళ్లుగా తీసుకుని ఎటువంటి స్పందన లేదన్నారు. వైఎస్‌ జగన్‌కు చెందిన భూములను ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరిశీలించినా, ఆ తరువాత ఎటువంటి స్పందనలేదన్నారు. పత్తి, ధాన్యం పంటలకు మద్దతు ధరలు లభించడం లేదని, సిసిఐ కేంద్రాల్లో రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం కోసం పాకులాడుతుంటే తాము రాజ్యాంగ బద్థమైన పాలన కోసం పోరాడుతున్నామని చెప్పారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పావుగా మారారని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం సమగ్ర భూ సర్వే అని అసమగ్ర సర్వేతో ముగించిందన్నారు. గ్రామాల్లోని భూములను ప్రపంచంలోని బడాబాబులకు కట్టబెట్టేందుకు ఏయే ప్రాంతాల్లో ఏ పంటలు పండుతాయి? భూముల స్వరూపం, వసతులపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేయిస్తుందని తెలిపారు. పేదలకు ఇచ్చిన 25 లక్షల ఎకరాల వరకు అసైన్డు భూములను బడాబాబులకు కటబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జగన్‌ బాటలోనే చంద్రబాబు కూడా పయనిస్తున్నారని, విదేశీ శక్తులు మన సంపదను దోచుకోవాడానికి పేదల భూములపై కన్నేశారని అన్నారు. కేరళలో ఉన్న మద్దతు ధరల చట్టాన్ని దేశం మొత్తం అమలు చేయాలన్నారు. రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్‌ కూడా ఇవ్వాలన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్‌ మాట్లాడుతూ రైతులను లక్షాధికారులను చేస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా సరిగా లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు అనేక ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెడితే పగుల గొట్టాలని చెప్పిన నారా లోకేష్‌ ఇప్పుడు వీటినే సమర్ధిస్తున్నారని అన్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రెండేళ్లు దాటినా ఇంత వరకు ఆయా కార్యాలయాల్లో మౌలిక వసతులు లేక ఉద్యోగులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మిస్తామని గత ప్రభుత్వం చెప్పినా ఆచరణ లేదన్నారు. జిల్లా కేంద్రంతో ధర్నా చౌక్‌ ఏర్పాటు చేయాలన్నారు. సాగర్‌ జలాశయం చెంతనే ఉన్నా బొల్లాపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం వరికపూడిసెల ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.విద్యాపరంగా పల్నాడు వెనుకబడిందని, సగటు అక్షర్యాసత 53 శాతంగా ఉందని అన్నారు. మిర్చి రైతులకు తెగుళ్లు వస్తే రైతులకు నష్ట పరిహారం అందలేదన్నారు. సిపిఎం జిల్లా నాయకులు డి.శివకుమారి మాట్లాడుతూ టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు రాజకీయ లబ్ధికోసం మోడీ మోచితి కింద నీళ్లు తాగుతూ రాష్ట్ర ప్రయోజనాలను, సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ విధానాలపై ఉద్యమిస్తామన్నారు.ఆకట్టుకున్న ప్రదర్శనమహాసభ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులు ఎర్ర జెండాలతో అలంకరించారు. సత్తెనపల్లి రోడ్డులోని కోట సెంటర్‌ నుండి బహిరంగ సభ వేదికైన పల్నాడు బస్టాండ్‌ వరకు సిపిఎం శ్రేణులు ఎర్ర దుస్తుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. వేదికపై ప్రజానాట్య మండలి కళాకారులు జగన్‌, టి.పెద్దిరాజు, సుందరయ్య, నాగమ్మ భారు, టి.కోటేశ్వరరావు విప్లవ గేయాలు ఆలపించారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కోలాటం, డప్పు కళాకారుల ప్రదర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్యా, సీనియర్‌ నాయకులు ఎవికె దుర్గారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఏపూరి గోపాలరావు, ఎ.లకీëశ్వరెడ్డి, ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, జి.రవిబాబు, నాయకులు షేక్‌.సిలార్‌ మసూద్‌, సయ్యద్‌ రబ్బాని, ఉమశ్రీ, మల్లీశ్వరి, విమల, బాలకృష్ణ, మస్తాన్‌వలి, కె.రామారావు, టి.శ్రీను, హనుమంతరావు, హనుమంతరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, మహేష్‌, కె.నాగేశ్వరరావు, సూరిబాబు పాల్గొన్నారు.

బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు

➡️