ప్రజల వైద్యులు శేషారెడ్డి..!

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్‌ రామచంద్రారెడ్డిల ఆదర్శాలకు అంకితమై జీవితాంతం పేద ప్రజలకు డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి వైద్య సేవలందించారు. ప్రజా వైద్యులుగా ప్రజలకు గుర్తుండిపోయారు. డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆశయాలే ఊపిరిగా శేషారెడ్డి చివరి వరకు పనిచేశారు. ఆయన చూపిన నిస్వార్ధపు సేవా బాటలోనే ఆస్పత్రి వైద్యులు ఇప్పటికీ పనిచేస్తున్నారు. మరణాంతరం డాక్టర్‌ శేషారెడ్డిపేరుపై నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం ఎందరికో సేవచేస్తుంది. డాక్టర్‌ శేషారెడ్డి ఈ పేరు వైద్యరంగంలో ఇప్పటికీ చరిత్రే… పేదలకు నిస్వార్థంగా చేయడంలోనూ, ప్రజా వైద్యం అందించడంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. 1930 మార్చి 10న కోవూరులో రామచంద్రారెడ్డి, కామమ్మ దంపతులకు శేషారెడ్డి జన్మించారు. ఈ కుటుంబంలో ఐదుగురు మగ పిల్లలు, ఒక ఆడబిడ్డ ఉన్నారు. సొదరులు డాక్టర్‌ దశరధరామిరెడ్డి కమ్యూనిస్టుపార్టీలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన ప్రోత్సహంతో డాక్టర్‌ శేషారెడ్డి, జక్కా వెంకయ్య కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య, శేషారెడ్డి బందువులు. శేషారెడ్డికి ఇంజినీర్‌ కావాలని ఆశ. ఆయనకు మెడిసన్‌ సీటు వచ్చింది. అందరూ కలిసి ఆయనను ఒప్పించారు. మద్రాసు మెడికల్‌ కాలేజీలో శేషారెడ్డి చేరారు. 1946 తెలంగాణా సాయుధ పోరాటం జరిగింది. ఆ సయమంలో శేషారెడ్డి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జక్కా వెంకయ్యను ఒప్పించారు. 1956లో డాక్టర్‌ పూర్తి చేసిన ఆయన డాక్టర్‌ రామచంద్రారెడ్డితో కలిసి వైద్యునిగా జీవితం ప్రారంభించారు. తన ఆస్తిని అమ్మిపార్టీకి విరాళం అందజేశారు. డాక్టర్‌ శేషారెడ్డి వృత్తిలోనే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోనేవారు. ఉదయం ఆసుపత్రి, సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఉండేవారు. డాక్టర్‌ రామచంద్రారెడ్డి మరణానంతరం డాక్టర్‌ శేషారెడ్డికి పెద్ద దిక్కుగా మారారు. ఎక్కడా వైద్యశాల ప్రతిష్ట తగ్గనీయలేదు. పేదలకు ఏ చిన్న రోగమొచ్చినా తొలుత డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రికి, అందులో డాక్టర్‌ శేషారెడ్డి తొలిసారి గుర్తుకు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. కేవలం వైద్యులుగానే మిగిలిపోలేదు. జిల్లాలో జరిగిన సామాజిక, పార్టీ, ఉద్యమాల్లో కీలకంగా ఉండేవారు. ప్రజా ఉద్యమాలకు పునాది వేశారు. 1986లో పార్టీ కేంద్ర న్యాయకత్వంలో మాట్లాడి కలకత్తాలో సదస్సు ఏర్పాటు చేశారు. వైద్య రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చారు. ఎందరో యువ డాక్టర్లును సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మలచారు. అభ్యుదయ మేధావులను ఒక్కటి చేయడానికి తనవంతు కృషిచేశారు. 1988 పిబ్రవరి 28న విజయవాడలో సదస్సు ఏర్పాటుచేసి ఒక వేదిక తయారుచేశారు. అదే ప్రస్తుతం సైన్స్‌ రంగంలో ఉన్న ‘జనవిజ్జానవేదిక’ రాష్ట్రంలో జరిగిన అక్షరాస్యత ఉద్యమంలో తొమ్మిది జిల్లాలకు ఆయన బాధ్యత వహించారు. సారా వ్యతిరేక ఉద్యమానికి రూపం తెచ్చింది. వెనుక ఉండి సూర్పి ఇచ్చిన వ్యక్తుల్లో శేషారెడ్డి ముఖ్యులు. 1992లో నెల్లూరు రెడ్‌క్రాస్‌ సంస్థను పునరుద్దరణ చేశారు. 1996లో బ్లడ్‌ బ్యాంక్‌ను పూర్తి చేశారు. కొందరు దీనిని సొంతం చేసుకోడానికి ప్రయత్నం చేస్తే శేషారెడ్డి దానిని తిప్పికొట్టారు. నెల్లూరు నగరంలోని ఐఎఎ భవన నిర్మాణంలోనూ ఆయన కృషి ఉంది. బంధువుల స్థలాన్ని ఐఎంఎ హాలు నిర్మాణానికి విరాళంగా ఇప్పించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించాలనే ఆశయంతో ఆయన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువతీ, యువకులకు ఆరోగ్య తరగతులు నిర్వ హించారు. వీరిలో అనేక మంది ప్రస్తుతం ఆర్‌ఎంపి డాక్టర్లుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో సుందరయ్య విజ్జాన కేంద్రం ఏర్పాటులనూ శేషారెడ్డి కీలక భూమికి పోషించారు. తమ ఆసుపత్రి సిబ్బందికి నిత్యం రాజకీయ తరగతులు నిర్వాహిస్తూ, ప్రజలకు ఎలా సేవచేయాలో చెప్పిన గొప్ప సామాజిక వైద్యులు శేషారెడ్డి! ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన ఆనార్యోగంతో 2008 జూన్‌ 12న చెన్నరులో మృతి చెందారు. అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మరణాంతరం నెల్లూరునగరలోని అపోలో ఆసుపత్రి సమీపంలో నిర్మించిన డాక్టర్‌ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం ఎందరికో ఉపయోగపడుతోంది. డాక్టర్‌ శేషారెడ్డి ప్రజలకు దూరమైన ఆయన పేదలకు అందించిన సేవలను అప్పుడు, ఇప్పుడు. ఎప్పుడు గుర్తించుకుంటున్నారు.

➡️