స్నానం చేయాలన్నా నీరు కరువే!

Mar 17,2025 00:14

చిలకలూరిపేట 12వ వార్డులో శ్మశానాన్ని పరిశీలిస్తున్న సిపిఎం బృందం
ప్రజాశక్తి-చిలకలూరిపేట : అడవిని తలపిస్తున్న శ్మశానం, స్నానం చేయడానికీ అందుబాటులో లేని నీరు, అస్తవ్యస్త రహదార్లపై పట్టణంలోని 12వ వార్డు ప్రజలు తమ ఆవేదననను సిపిఎం నాయకులు ఎదుట వ్యక్తం చేశారు. ఆ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం బృందం 12వ వార్డులో ఆదివారం పర్యటించింది. పలు ఇళ్లను సందర్శించి విద్యుత్‌ బిల్లులపై వివరాలను, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మీటర్‌ రీడింగ్‌లో అవకతవకలున్నట్లు పలువరు చెప్పారు. గత నెల వాడిన 119 యూనిట్ల కరెండు వాడగా రూ.1034 బిల్లు వచ్చిందని చిరు దుకాణం నిర్వాహకుడు షేక్‌ గఫూర్‌ వాపోయారు. చిన్న దుకాణమే అయినా వ్యాపారం చేస్తున్నారంటూ స్మార్ట్‌ మీటర్‌ బిగించారని వాపోయారు. ఎవరూ నివాసం ఉండని ఇళ్లకు సైతం వివిధ రకాల ఛార్జీలు కలిపి అధికంగా బిల్లు వస్తోందని నాయకులు దృష్టికి వచ్చింది. పట్టణంలోని హిందూ, క్రిస్టియన్‌ ఏకైక శ్మశాన వాటికను 2016లో అభివృద్ధి చేశారని, తర్వాత పట్టించుకోక అడవిని తలపిస్తోందని చెప్పారు. వెళ్లడానికి సరైన మార్గం, విద్యుత్‌ దీపాలు లేవని, స్థలమూ ఆక్రమణకు గురవుతోందని, విష సర్పాలు సంచరిస్తున్నాయని 12వ వార్డు ప్రజలు చెప్పారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్‌లో ఈస్టర్‌ పండుగ దృష్ట్యా మున్సిపల్‌ అధికారులు స్పందించాలని, శ్మశానాన్ని బాగు చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు తీవ్ర భారంగా మారిన విద్యుత్‌ ఛార్జీల సమస్యపై 28న స్థానిక విద్యుత్‌ కార్యాలయం వద్ద సిపిఎం చేపట్టే ధర్నాకు తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, నాయకులు టి.ప్రతాప్‌రెడ్డి, ఎస్‌.బాబు, ఎస్‌.కృపారావు, పి.గణేష్‌ పాల్గొన్నారు.

గుంటూరు కళ్యాణి నగర్‌లో ప్రజలతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : సిపిఎం చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలలో భాగంగా ఆ పార్టీ గుజ్జనగుండ్ల శాఖ ఆధ్వర్యంలో కళ్యాణి నగర్‌, రైల్వేట్రాక్‌, ఇతర ప్రాంతాలలో నాయకులు ఆదివారం నిర్వహించారు. స్థానికంగా రైల్వే ట్రాక్‌పై ఇళ్లేసుకుని 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలు వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాల్వలు, రోడ్లు వేయాలని కోరారు. సీలింగ్‌ ల్యాండ్‌ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, కార్యదర్శివర్గ సభ్యులు బి.సత్యనారాయణ, కమిటీ సభ్యులు షేక్‌.ఖాజావలి, భాషా, నాయకులు బాబురావు, సుందరరావు, బాబు, భానుప్రసాద్‌ పాల్గొన్నారు. స్థానిక ప్రగతి నగర్‌లోని నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు, సభ్యులు షేక్‌.ఫాతిమా, జి.బాబు పాల్గొన్నారు.
పాతగుంటూరులో ..
పారిశుధ్యం అధ్వానంగా ఉందని, కాల్వలు తీసే కార్మికులు రావట్లేదని, దోమలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్‌ అన్నారు. పాత గుంటూరులోని 8, 9, 11 డివిజన్‌లలో సిపిఎం బృందం పర్యటించగా అక్కడి పరిస్థితులపై నళినీకాంత్‌ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య సమస్య పరిష్కారానికి కార్మికుల సంఖ్యను పెంచి, అన్ని ప్రాంతాలకూ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు తాడిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ యానాది కాలనీ శివారు జానీ స్వరాజ్య నగర్‌లో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. చెన్నం వారి వీధిలో అడ్డ రోడ్లలో కాల్వల్లో మురుగు తొలగించక పోవడంతో రోడ్లపై మురుగు నిలుస్తోందని, దీంతో దోమలు ఎక్కువగా ఉన్నాయని మున్సిపల్‌ అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. శ్రామిక నగర్లో కాల్వల్లో రెండు నెలలుగా వ్యర్థాలు తొలగించట్లేదని స్థానిక ప్రజలు వాపోయారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్‌.అరుణ, పాతగుంటూరు శాఖ కార్యదర్శి శనగపల్లి కార్తీక్‌, నాయకులు కుమార్‌, టి.రాము పాల్గొన్నారు.

➡️