ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌ను తాత్కాలికంగా నిలిపిన విషయంపై ఆర్వో సూర్యనారాయణ రెడ్డి శనివారం స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి నామినేషన్ పై రామకృష్ణ అనే వ్యక్తి ఆమంచి ఫ్యాక్టరీకు సంబంధించి ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది అని చేసిన ఫిర్యాదు పై ఆయన నామినేషన్ ను శుక్రవారం తాత్కాలికంగా వాయిదా వేసి నిలిపామని చెప్పారు. అయితే చట్టం ప్రకారం 1951 సెక్షన్ 88 ఎ ద్వారా నామినేషన్ తిరస్కరణ పై పూర్తిగా విశదీకరించామని అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం రామకృష్ణ ఫిర్యాదు చెల్లుబాటు కాకపోవటంతో ఆమంచి నామినేషన్‌ను శనివారం స్క్రుటిని చేసి ఆమోదించటం జరిగింది అని ప్రకటించారు. మొత్తంగా ఈ నెల 18 నుండి జరిగిన నామినేషన్ దాఖలులో మొత్తం 39 నామినేషన్ పేపర్లు వచ్చాయని అందులో డమ్మీ సెట్లు పోగా 23 మంది అభ్యర్థుల నుండి వారి నామినేషన్లను స్క్రుటిని చేశామన్నారు. ఈ స్క్రుటినిలో ఆరుగురి అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ జరిగింది అన్నారు. మిగిలిన 17 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు.
39 నామినేషన్లకు 17 మంది అభ్యర్థులకు ఆమోదం : చీరాల ఆర్వో
