మీడియాపై కక్ష సరికాదు

ప్రజాశక్తి-మార్కాపురం : అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మీడియాపై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మీడియా ప్రతినిధులపై నమోదు చేసిన కేసులు కక్షపూరితంగా నమోదు చేసినవేనని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఓరుగంటి మల్లిక్‌ అన్నారు. ఖచ్చితంగా మాచర్లలో వైసిపి కార్యకర్త హత్యను టిడిపి నేతలు చేశారని సాక్షిలో వెలువడిన కథనంపై అక్కడి డిటిపి నేతలు ఫిర్యాదు చేశారన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమి జరిగిందో తెలిసుకోకుండా పోలీసులు అక్కడి విలేకరితో పాటు ఆ పత్రిక సబ్‌ఎడిటర్‌, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడంలో అర్ధం లేదన్నారు. ఇలాగైతే భవిష్యత్‌లో ఏ పత్రిక కూడా మనుగడ సాగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ మార్కాపురం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని నిరసన ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ సహదీత్‌ వెంకట్‌ త్రివినాగ్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అనంతరం మల్లిక్‌ మాట్లాడుతూ అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా పోలీసు కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మీడియా రంగం లేకుండా చేయాలనే కుట్రలో భాగమే ఈ అక్రమ కేసుల బనాయింపు అని పేర్కొన్నారు. ఈ అక్రమ కేసుల పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు దొండపాటి మోహన్‌రెడ్డి, సాక్షి ప్రతినిధులు జిఎల్‌ నరసింహారావు, జగన్నాధరెడ్డి, మల్లికార్జున, ఇతర మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️