లేదంటే చింతపల్లిలో కలపాలి : సిపిఎం
ప్రజాశక్తి-కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని మూలపేట, డౌనూరు, చిట్టంపాడు, గడపపాలెం తదితర నాలుగు పంచాయతీలు మండల కేంద్రానికి దూరంగా ఉన్నాయని, వాటిని మినీ మండలంగా చేయాలని, లేదంటే చింతపల్లి మండలంలో కలపాలని సిపిఎం కొమ్ముర్ల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం జరిగిన కొమ్ముర్ల శాఖ మహాసభలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సాన తీర్మానం ప్రవేశ పెట్టగా, ప్రసాద్ బలపర్చారు. ఈ తీర్మానాన్ని శాఖ మహాసభకు హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ కొయ్యూరు మండలంలోని నాలుగు పంచాయతీ పరిధిలో 27 గ్రామాలు, సుమారు పదివేల జనాభా ఉందని చెప్పారు. వీరంతా మండల కేంద్రంలో పనుల కోసం కొయ్యూరుకు 80 కిలోమీటర్ల దూరం, నర్సీపట్నం, గొలుగొండ రెండు మండలాలు దాటి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య కారణాల వల్ల వెళ్లిన రోజు పని అవ్వకపోతే ఉండిపోవడానికి ఆస్కారం లేదన్నారు. తహశీల్దారు, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్లో పనులన్నీ సాయంత్రం 6, రాత్రి 10 కూడా అవుతుందని, అలాంటప్పుడు అక్కడ నుంచి వారి గ్రామాలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. అందుకే ప్రభుత్వం ఆలోచించి డౌనూరు కేంద్రంగా మినీ మండలం ఏర్పాటు చేయాలని, లేకపోతే దగ్గరిలో ఉన్న చింతపల్లి మండలంలో కలపాలని కోరారు. దీని కోసం భవిష్యత్తులో బలమైన పోరాటం చేయటానికి సిద్ధమవుతామన్నారు. ఆ దిశగా అందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వై.అప్పలనాయుడు, సత్తిబాబు, చిట్టిబాబు, సభ్యులు పాల్గొన్నారు.