ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రైతులు పండించిన కందులను రైతుసేవ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ధనుంజరు సూచించారు. జిల్లాలో 67,270 ఎకరాల్లో కంది సాగైందని, 50,879 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారని చెప్పారు. వీటిని జిల్లాలోని 28 మండలాల్లోని 387 రైతుసేవా కేంద్రాల్లో కొంటామన్నారు. తొలి విడతలో 41 కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్ నిర్ణయించిన మద్దతు ధర క్వింటాళ్ రూ.7550 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. కొన్న పంటను రైతుసేవా కేంద్రాల నుండి మార్క్‌ఫెడ్ నిర్ణయించిన వాహనాల ద్వారా సిడబ్ల్యూసి సత్తెనపల్లికి చేరవేస్తామన్నారు. ఈ-క్రాప్‌లో కంది పంటను నమోదు చేసుకున్న రైతులు తమ పంటను అమ్ముకోవడానికి గురువారం నుండి నమోదు చేసుకోవాలని సూచించారు.
ఫిర్యాదుల పరిష్కారానికి మార్గాలు కనిపెట్టండి
ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులకు మెరుగైన పరిష్కార మార్గాలు కనిపెట్టాలని అధికారులకు జెసి సూచించారు. ఈ మేరకు నరసరావుపేట కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల పరిశీలనను జెసి పరిశీలించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని. భూ సమస్యలకు సరైన పరిష్కారం చూపాలని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, ఆర్‌ఐలు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/pnd-116.jpg)