వరి పంట నమోదుకు 15వ తేదీ తుదిగడువు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలో రబీ పంటలకు సంబంధించి 48,411 ఎకరాల మేర ఇన్యూరెన్స్ బుకింగ్ సాగింది. వరి పంటకు ఈనెల 15వ తేదీ వరకు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం కల్పించారు. మిగిలిన పంటలకు ఇప్పటికే సమయం ముగిసిన సంగతి విధితమే. రైతులంతా రైతు సేవా కేంద్రాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో రబీ పంటలు రెండవ ప్రాధాన్యతలో ఉంటాయి. కేవలం నీటి లభ్యత ఉన్నచోట మాత్రమే వరి తదితర పంటలు సాగవుతాయి. మిగిలిన చోట్ల ఇతర పంటలు సాగువుతున్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,62,617 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 70,566 ఎకరాల్లో సాగయ్యాయి. అత్యధికంగా మినుములు 28,659 ఎకరాలు, పెసలు 12,405, మొక్కజొన్న 23, 700 ఎకరాల్లో సాగయ్యాయి. రాగులు 1137 ఎకరాలు, ఉలవలు 825, మిర్చి 62ఎకరాలు, వేరుశనగ 356, కూరగాయలు 766 ఎకరాలు, వివిధ రకాల పండ్లు 292, టమాట 121, వరి 106 ఎకరాల చొప్పున పడ్డాయి. సీజన్ ఫిబ్రవరి వరకు ఉన్నందున మొక్కజొన్న విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో నాలుగు పంటలు (పెసలు, మినుములు, మొక్కజొన్న, వరి) పంటలకు మాత్రమే ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించారు. ఈ ఏడాది అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా సదుపాయం ప్రభుత్వం కల్పించింది. ఈ కంపెనీ నిబంధనల ప్రకారం మొక్కజొన్నకు రూ.540, మినుములు, పెసలు రూ.300, వరి రూ.630 ప్రీమియం చెల్లించాల్సివుంది. 510 రైతు సేవా కేంద్రాల ద్వారా మొత్తం 27,115 మంది రైతుల నుంచి 1,23,329 బీమా దరఖాస్తులు స్వీకరించారు. రుణసాయం పొందినవారి వద్ద నుంచి సంబంధిత బ్యాంకులే పంటల బీమా ప్రీమియం మినహాయిస్తున్న సంగతి విధితమే. రుణాలు తీసుకోని రైతులు కూడా కొన్ని మండలాల్లో శతశాతం రైతులు బీమా సదుపాయానికి ఆసక్తి చూపినట్టుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 100శాతం బీమా సదుపాయం పొందిన మండలాల్లో గంట్యాడ, జామి, ఎస్.కోట, ఎల్.కోట, దత్తిరాజేరు, బొబ్బిలి, బాడంగి, బొండపల్లి, రాజాం మండలాలు ఉన్నాయి. తెర్లాంలో 90శాతం మంది రైతులు ఇన్సూరెన్స్ పొందారు. మొత్తంగా 48,411 ఎకరాల మేర బీమా సదుపాయం నమోదైంది. వరినాట్లు అక్కడక్కడా ఇంకా పడుతున్నందున ఈనెల 15వ తేదీ వరకు బీమా ప్రీమియం చెల్లించు కునేందుకు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ అవకాశం కల్పించింది. రైతులు స్థానిక రైతు సేవాకేంద్రాలను సంప్రదించి ప్రీమియం చెల్లించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓవైపు పంటల సాగుకు పెరిగిన పెట్టుబడులు, మరోవైపు తరచు అతివృష్టి, అణావృష్టి, చీడపీడలు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో రైతులకు పంటల బీమా అత్యంత ప్రాధాన్యతగానే భావించాల్సివుంది.