జిపిఎస్‌ జీవో 54 ప్రతుల దగ్ధం

జిఒ 54 గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రతులను దగ్ధం చేస్తున్న యుటిఎఫ్‌ నేతలు, టీచర్లు

ప్రజాశక్తి-అనకాపల్లి

రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయానికి భిన్నంగా గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చినబ్బారు డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించిన జిఒ 54 ప్రతులను యుటిఎఫ్‌ ఆధ్వర్యాన స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఏళ్ల తరబడి ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, విద్యా శాఖ మంత్రి లోకేష్‌ కూటమి అధికారంలోకి వస్తే సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అది నమ్మిన ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశలను వమ్ము చేస్తూ, వైసిపి ప్రభుత్వం రూపొందించిన జిపిఎస్‌ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం చట్టబద్ధం చేస్తూ, పాత తేదీలతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం అన్యాయమన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోషించిన పాత్రను నెలలోపే కూటమి ప్రభుత్వం మర్చిపోయినట్లు ఉందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలు చేయాలని చూస్తే పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎల్లయ్యబాబు, ఎంవి.అప్పారావు, జిల్లా కార్యదర్శి శేషుబాబు, కోశాధికారి జోగా రాజేష్‌, సీనియర్‌ నాయకులు జికెఆర్‌ స్వామి, అలివేలు, రాజునాయుడు, దేముడు నాయుడు, బండారు శంకర్‌, సలీం, రవి, మున్సిపల్‌ ఉపాధ్యాయుల నాయకులు సతీష్‌, మోడల్‌ స్కూల్‌ నాయకులు ఆశాలత, ఏపీసిపిఎస్‌ఇఏ నాయకులు ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.జిపిఎస్‌ గెజిట్‌ను ఉపంహరించుకోవాలి : ఎపిటిఎఫ్‌ బుచ్చయ్యపేట : సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ ఇస్తామని అధికారంలోకి గత వైసీపి ప్రభుత్వం మోసపూరితంగా జిపిఎస్‌ చట్టం చేసి ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురైందని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కెకెఎల్‌ఎన్‌.ధర్మారావు, ఎస్‌.దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఆదివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని జిపియస్‌ గెజిట్‌ని ఉపసంహరించుకోవాలని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

➡️