గుండె పదిలంగా ఉండాలని 5కె, 2కె వాక్‌లు

Sep 30,2024 00:46

ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : అత్యవసర, ప్రాణాపాయ పరిస్థితుల్లో సిపిఆర్‌ ద్వారా ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని, వ్యక్తి ఆక్సిజన్‌ తీసుకోలేనప్పుడు గుండెకు ఆక్సిజన్‌ పంపింగ్‌ చేసేందుకు సిపిఆర్‌ దోహదం చేస్తుందని నరసరావుపేట మహాత్మా గాంధీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అధినేత ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 5కె వాక్‌కు విశేష స్పందన లభించింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం నుండి బైపాస్‌ రోడ్డు, పల్నాడు రోడ్డు, మల్లమ్మ సెంటర్‌ మీదుగా వాక్‌ నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి డాక్టర్‌ కారసాని శ్రీనివాసరెడ్డి రూ.500 విలువైన టి షర్ట్‌, టోపి బహుమతిగా ఆందజేశారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి తమ హాస్పిటల్‌ గుండె పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. లక్కీ డ్రా ద్వారా నలుగురికి సైకిళ్లు బహుమతిగా అందజేస్తామని డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

ప్రజాశక్తి – వినుకొండ : శ్రీ దత్త హాస్పిటల్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుండి ఉదయం 7 గంటలకు ప్రముఖ గుండె వైద్యులు గార్లపాటి కృష్ణకాంత్‌ సారథ్యంలో 2కె వాక్‌ నిర్వహించారు. పట్టణంలోని వైద్యులు, ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణం వద్ద నుండి ప్రారంభమైన వాక్‌ స్తూపం సెంటర్‌, ఏనుగుపాలెం రోడ్డు మీదుగా శ్రీ దత్త హాస్పిటల్‌ వరకూ కొనసాగింది. గుండె పనితీరు, సమస్యలు, నివారణ చర్యలపై డాక్టర్‌ గార్లపాటి కృష్ణకాంత్‌ డాక్టర్‌ గార్లపాటి జ్ఞానేశ్వరి వివరించారు. డాక్టర్లు పూర్ణిమ, అన్న మణికంఠ సురేష్‌, ఎల్‌ఎన్‌ రావు, ఆనంద్‌ కుమార్‌, ప్రసన్న పాల్గొన్నారు.

➡️