కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
10 హిట్ అండ్ రన్ కేసులకు కమిటీ ఆమోదం
ప్రజాశక్తి-విజయనగరంకోట : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, కారణాలను గుర్తించేందుకు జాతీయ రహదారిపై 64 సిసి కెమేరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. విజయనగరం డివిజన్‌లో గుర్తుతెలియని వాహనాలు ఢకొీని మృతి చెందిన, క్షతగాత్రులుగా మారిన మొత్తం 10కేసులపై సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హిట్ అండ్ రన్‌కు సంబంధించిన కేసులు ఏవీ పెండింగ్లో లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 34 కిలోమీటర్ల మేర ఉన్న 16వ జాతీయ రహదారిపై 64 సిసి కెమేరాలను ఏర్పాటు చేసేందుకు రూ.5లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లు, నేరాలు జరిగే చోట్లను దశలవారీగా అన్నిచోట్లా సిసి కెమేరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికోసం సమగ్ర సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఎఎస్‌పి సౌమ్యలత, ఇన్‌ఛార్జి జెసి ఎస్.శ్రీనివాసమూర్తి, డిటిఒ మణికుమార్, డిఎంఅండ్‌హెచ్‌ఒ జీవనరాణి, ఆర్‌డిఒలు, డిఎస్‌పిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.