విజయనగరంలో 69.4 శాతం పోలింగ్‌

May 13,2024 22:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గంలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత నగరంలో లంకాపట్నం, గురజాడ స్కూల్‌, ఎంఆర్‌ కాలేజీ, మంగళ వీధి, కెఎల్‌ పురం తదితర ప్రాంతాల్లో ఇవిఎంలు గంటపాటు మొరాయించాయి. ఎంఆర్‌ కాలేజీలో మంత్రి బొత్స సత్యనారాయణ వేయాల్సిన పోలింగ్‌ కేంద్రం-166లో ఇవిఎం మొరా యించింది. దీంతో ఉదయం 8.30 గంటలకు ఓటు వేసేం దుకు రావాల్సిన మంత్రి బొత్స 9.30 గంటలకు వచ్చారు. ఇవిఎం మరొకటి ఏర్పాటు చేయడంతో ఆ కేంద్రంలో ఓటింగ్‌ ప్రశాంతంగా సాగింది. నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియకు ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు నియోజకవర్గంలో 8.25 శాతం, 11 గంటలకు 22.38 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 38.65 శాతం, మధ్యాహ్నం మూడు గంటలకు 44.40 శాతం, 4 గంటలకు 54.24 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014లో విజయనగరం నియోజకవర్గంలో 71.28 శాతం, 2019లో 70.86 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ సమయం ముగిసినప్పటికీ విజయ నగరం నియోజకవర్గంలోని గుంకలాం, ద్వారపూడి, చెల్లూరు, వైఎస్‌ఆర్‌ నగర్‌, గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి, నెల్లిమర్లలోని డెంకాడ, నాతవలస, భోగాపురం మండల కేంద్రంలోని పలు పోలింగ్‌ బూతుల్లో పోలింగ్‌ కొనసాగింది. – విజయనగరంలోని కనపాక, లంకాపట్నం విద్యుత్‌ నిలిచిపోవడంతో చీకటిలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసిపి ఏజెంట్‌ వద్ద ఫోన్‌ లాక్కున్న టిడిపి అభ్యర్థివిజయనగరం కోట: విజయనగరం మండలం గొల్లలపేటలో వైసిపి ఏజెంట్లు ఫోన్లు పట్టుకొని పోలింగ్‌ బూత్‌లో ఉండడంతో టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు వారి నుంచి ఫోన్‌ లాక్కొని కలెక్టర్‌కు సమాచారం అందించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే కలెక్టర్‌ బిజీగా ఉండడంతో ఫిర్యాదును రాతపూర్వకంగా ఇవ్వాలని సిబ్బంది సూచించారు. తాను ఉదయం నుంచి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా అధికారులు పట్టించుకోలేదని అదితి గజపతి తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి జొన్నగుడ్డి మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకరి సతీష్‌ విజయనగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

➡️