ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : వినుకొండ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేని బయోప్రొడక్ట్స్ అమ్మకాలపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు, స్థానిక అధికారులతో కలిసి 3 ప్రత్యేక బృందాలు నియోజకవర్గంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా పలువురు ఎరువుల వ్యాపారులు తమ దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు. తలుపులు తీసి ఉన్న షాపుల వరకు అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు రూ.4 లక్షల విలువైన ఎరువులు అమ్మకాలు నిలిపివేశారు. అనంతరం పట్టణ సమీపంలోని మార్కాపురం రోడ్డు, కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా ఉన్న అనధికార గౌడౌన్ (నెం-44) లో బయో ప్రొడక్ట్స్ ఉన్నాయని గుర్తించి పోలిస్ బందోబస్తు మధ్య గౌడౌన్ తాళాలు పగులగొట్టి చూడగా అందులో అనుమతులు లేని, అనధికారికంగా నిల్వ ఉంచిన బయో ఉత్పత్తులను గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.75.24 లక్షల విలువైన బయో ప్రొడక్ట్స్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసి, వాటిని పట్టణంలోని లక్ష్మీ వెంకట శ్రీనివాస ట్రేడర్స్‌కు అప్పగించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మరో రెండు బృందాలు బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎరువులు, పురుగు మందులను అమ్మకాలను నిలిపేయగా, మరి కొన్నింటిని సీజ్ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.