నరసరావుపేట ఆస్పత్రికి 75 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌

Apr 10,2025 23:29

నూతన కమిటీని సత్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ (హెచ్‌డిఎస్‌) ప్రమాణ స్వీకారం ఆస్పత్రిలో గురువారం నిర్వహించారు. చైర్మన్‌గా డాక్టర్‌ రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సభ్యులుగా డాక్టర్‌ కంకణపాఠి భారతి, మల్లికార్జున రావు, సుబ్బమ్మ, ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యశాలలో 200 పడకలతో నియోనేటాలజీ, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో తదితర అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నర్సింగ్‌ సిబ్బంది తక్కువగా ఉన్నారన్నారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నరసరావుపేట ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలను మెడికల్‌ కళాశాలగా తీర్చిదిద్దాలన్నారు. కార్డియో, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలకు చెందిన పట్టణానికి చెందిన సూపర్‌ స్పెషలిస్ట్‌ వైద్యులను వారానికి ఒకసారి ఈ వైద్యశాల సందర్శించేలా కృషి చేస్తామని చెప్పారు. 75 పడకలతో కూడిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ మంజూరైందని, కేంద్ర ప్రభుత్వం రూ.36 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. పల్నాడు బస్టాండ్‌లోని పాత వైద్యశాలలో 100 పడకలతో తల్లీబిడ్డల యూనిట్‌ ప్రారంభించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు మత్తు పదార్థాలు సేవించి వివాదాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని, పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంపీ మాట్లాడుతూ వైద్యశాలను మరో 150 పడకలతో 350 పడకల టీచింగ్‌ వైద్యశాలగా రాబోయే 2 ఏళ్లలో తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రభుత్వ వైద్యశాలకు కావాల్సిన అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తాను కేంద్ర స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బివి రంగారావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.సురేష్‌ కుమార్‌, ఆర్‌ఎంఒలు డాక్టర్‌ ఏడుకొండలు, కె.దయానిధి, డాక్టర్‌ మంత్రునాయక్‌, డాక్టర్‌ ప్రసూన, డాక్టర్‌ అలేఖ్య, డాక్టర్‌ కౌముది, డాక్టర్‌ రామేశ్వరి, డాక్టర్‌ నజియా, డాక్టర్‌ హేమశ్రీ పాల్గొన్నారు.

➡️