అనకాపల్లి నియోజకవర్గంలో 78.96 శాతం పోలింగ్‌

అనకాపల్లిలో ఓట్లు వేయడానికి బారులుతీరిన ఓటర్లు

ప్రజాశక్తి-అనకాపల్లి

అనకాపల్లి నియోజకవర్గంలో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుండే పోలింగ్‌ ప్రారంభం కాగా, జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పోలింగ్‌ శాతం ప్రారంభం నుంచి ఎక్కువగానే నమోదు అవుతూ వచ్చింది. 9 గంటల సమయానికి గరిష్టంగా 28.54 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 46.10 శాతం, మూడు గంటలకు 60.80 శాతం, సాయంత్రం ఐదు గంటలకు 65.40 శాతం ఓట్లు నమోదు కాగా, పోలింగ్‌ ముగిసే నాటికి 78.86 శాతం పోలింగ్‌ నమోదైంది. జనసేన కొణతాల రామకృష్ణ స్థానిక గవరపాలెం జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. అనకాపల్లి పట్టణం గాంధీనగర్‌ జీవీఎంసీ స్కూలులోని156 పోలింగ్‌ బూత్‌లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఐ.ఆర్‌.గంగాధర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. పార్లమెంటు సభ్యురాలు డాక్టర్‌ బివి సత్యవతి అనకాపల్లి జీవీఎంసీ బాలుర ఉన్నత పాఠశాలలోనూ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లిలోనూ ఓటు వేశారు. పోలింగ్‌ తీరును అభ్యర్థులు కొణతాల రామకృష్ణ, మలసాల భరత్‌ కుమార్‌, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేమునిగుమ్మంలో పోలింగ్‌ స్టేషన్‌ను టిడిపి రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు పరిశీలించారు. పట్టణంలోని గవర పాలెం ప్రాంతంలో శతకం పట్టు 229 బూతులో ఉదయం నుంచి ఓటింగు మందకొడిగా సాగింది. ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం అయ్యేసరికి ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వందలాదిగా ఓటర్లు నిలిచిపోవడంతో కాస్త తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఓటర్లకు సర్దిచెప్పి ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు.వృద్ధురాలితో ఓటు వేయించిన ఎస్‌ఎఫ్‌ఐ నేత ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి గొర్లి తరుణ్‌ సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో అనకాపల్లి అంజయ్య కాలనీలో 86 సంవత్సరాల వృద్ధుడైన మల్ల రమణను అంజయ్య కాలనీ 189వ బూతులో ఓటు వేసేందుకు మూడు చక్రాల చైర్‌లో తీసుకువెళ్లి ఓటు వేయించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.కశింకోట మండలంలో ఘర్షణలు కశింకోట : మండలంలోని జోగారావుపేట పోలింగ్‌ బూత్‌లో వైసిపి, టీడీపి నాయకుల మధ్య ఘర్షణలు జరిగింది, నర్సింగబిల్లి, చెరకాము, తీడ పోలింగ్‌ కేంద్రాల వద్ద వైస్సార్సీపీ, టీడీపి నాయకులు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిని సముదాయించారు. పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వేశారు. కశింకోట మండలం ఏఎస్‌ పేటలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌ కుమార్‌ ఓటు వేశారు. ఇదే గ్రామంలో గగనం పార్వతి (92) వృద్ధురాలు ఓటు వేశారు.

➡️