ప్రజాశక్తి – తిరుపతి సిటీ : టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఇఒ జె శ్యామలరావు వెల్లడించారు. గోశాలలో వంద ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో మాజీ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. సోమవారం టిటిడి పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 మార్చి నుంచి 2024 మార్చి వరకు టిటిడి గోశాలలో పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయని అప్పటి విజిలెన్స్ నివేదికలలో తేటతెల్లమవుతోందన్నారు. గోవులకు కాలం చెల్లిన మందులు, ఇచ్చినట్లు, పురుగులు పడ్డ దాణా, పాచిపట్టిన నీరు అందించారని, చనిపోయిన గోవుల వివరాలను నమోదు చేయలేదని టిటిడి విజిలెన్స్ నివేదికలలో నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాచిపెట్టారని విమర్శించారు. తీవ్ర వ్యాధులతో ఉన్న గోవుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా రెండుసార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయని, దాణా, మందుల సరఫరా కాంట్రాక్టులోనూ భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు వీటిపై చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదని, ఇప్పుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. టిటిడి గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, టిటిడి డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్, ఇన్-చార్జ్ డైరెక్టర్ ఎస్‌పి గోశాల శ్రీనివాసులు, విజిఒ విజిలెన్స్ రామ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు నిరాధారం : టిటిడి ఇఒ శ్యామలరావు
