85 శాతం పోలింగ్‌ రికార్డు

ప్రజాశక్తి-కనిగిరి: 85 శాతం పోలింగ్‌ జరగడం కనిగిరి నియోజకవర్గ చరిత్రలో రికార్డు అని కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియపై కనిగిరి పట్టణ టిడిపి బూత్‌ ఇన్‌ఛార్జులు, టిడిపి శ్రేణులతో వార్డుల వారీగా సమీక్ష సమావేశాన్ని బుధవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో వైసిపి కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, టిడిపి శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కనిగిరి నియోజకవర్గానికి చెందిన 44 వేల మంది ఓటర్లు కనిగిరికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. జూన్‌ 4న కనిగిరి కొండపై టిడిపి జెండా రెపరెపలాడటం ఖాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. నియోజక వర్గ టిడిపి శ్రేణుల నుంచి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియపై సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు 145 స్థానాలతో ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయ మన్నారు. ఆయన కనిగిరికి ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండో రోజు కూడా డాక్టర్‌ ఉగ్రను కలిసి అభినందించేందుకు కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా వచ్చిన టిడిపి శ్రేణులతో అమరావతి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

➡️