92 శాతం పని దినాలు పూర్తి : డ్వామా పీడీ

Feb 11,2024 20:22

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా కార్డుదారులందరికీ ఇప్పటి వరకు 92శాతం పని దినాలు పూర్తి చేశామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉమాపరమేశ్వరి తెలిపారు. వీటిలో జనవరి 11వ తేదీ వరకు చేసిన పనులకు సంబంధించి రూ.401.35కోట్ల మేర కూలీల ఖాతాల్లో వేతనాలు జమచేశామని అన్నారు. ఫిబ్రవరి ఆఖరునాటికి లక్ష్యానికి మించి ఉపాధి పనులు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని పంచాయతీల్లో మినహా మిగిలిన అన్నిచోట్లా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. వైఎస్‌ఆర్‌ జలకళ పథకంలో భాగంగా గడిచిన ఐదేళ్లలో 373బోర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ వారం కలిసిన ప్రజాశక్తికి పీడీ ముఖాముకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే…..

ఇప్పటి వరకు ఎన్ని పనిదినాలు కల్పించారు?

ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 1.82కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా సుమారు 1.67లక్షల పనిదినాల వరకు కల్పించాం. దాదాపు 92శాతం పనిదినాలు కల్పించినట్టు లెక్క. జనవరి 11 నాటికి పూర్తయిన పనులకుగాను రూ.401.35కోట్ల మేర కూలీల ఖాతాల్లో జమయ్యింది. ఈనెలాఖరు నాటికి పనిదినాలు కల్పించడంలో లక్ష్యాన్ని చేరుకుంటాం. గత ఆర్థిక సంవత్సరంలో 1.97కోట్ల పనిదినాలు కల్పించగా, సుమారు రూ.490కోట్ల వరకు కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.

ప్రస్తుతం ఉపాధి పనులు జరుగుతున్నాయా?

జిల్లా వ్యాప్తంగా 6.80లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో సాంకేతికలోపం వల్ల కొత్తగా ఏర్పడిన కొన్ని పంచాయతీల్లో 2,871 మందికి మూడు నెలలుగా పని కల్పించడం సాధ్యం కాలేదు. మిగిలినవారంతా పనులు చేసు కుంటున్నారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగు తున్నాయి. సంక్రాంతి తరువాత నుంచి పనులు క్రమంగా పుంజుకున్నాయి. రోజూ 1.2లక్షల పనిదినాలను కూలీలు ఉపయోగించుకుంటున్నారు. ప్రతి 15రోజులకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి లక్ష్యానికి మించి ఉపాధి పనులు కల్పిస్తామన్న ధీమా ఉంది.

కొన్ని పంచాయతీల్లో పనులు నిచిపోవడానికి కారణం ఏమిటి?

కొత్తగా ఏర్పాటైన కొన్ని పంచాయతీల్లో గత ఏడాది నవంబర్‌ నుంచి ఉపాధి పనులు నిలిచిపోయాయి. ఆయా పంచాయతీలకు ఎల్‌జిడి (లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరేట్‌) కోడ్‌ రూపొందించలేదు. ఆ కోడ్‌ ఉంటే తప్ప ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌లో ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులు ప్రతిపాదించడం, ప్రభుత్వం నుంచి ఆమోదం పొందడం సాధ్యం కాదు. ఆ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌ ద్వారా ఇప్పటికే సిసిఎల్‌ఎ కమిషనర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పరిష్కారమౌతుందని ఆశిస్తున్నాం.

ఉపాధి పనులు నిలిచిపోయిన గ్రామాలు ఎన్ని?

వాటిపేర్లు ఏమిటి? ఎల్‌జిడి కోడ్‌ సాంకేతిక వల్ల జిల్లాలో మొత్తం 11 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు నిలిచిపోయాయి. పనులు నిలిచిపోయిన వాటిలో మెరకముడిదాం మండలం నరసయ్యపేట, ఎం.గదబవలస, గుర్ల మండలం ముద్దాడపేట, రౌతువలస, కేశవుపేట, నెల్లిమర్ల మండలం పెదబూరాడపేట, మెంటాడ మండలం చింతాడవలస, విజయనగరం మండలం బడుకొండపేట, సుంకరిపేట, చిల్లపేట, గుండాలపేట ఉన్నాయి.

ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ ఎంత వరకు వచ్చింది?

ఉపాధి కూలీలకు ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ విధానం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చింది. మన రాష్ట్రంలోనూ, జిల్లాలో ఈ ఏడాది జనవరి 1నుంచి అమలవుతుంది. జిల్లాలో అందరికీ ఆధార్‌ నెంబర్‌ ద్వారానే కూలి సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. జనవరి నెలకు ముందుగానే మూడు నెలలపాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి జాబ్‌కార్డులకు ఆధార్‌ లింకు చేయడం జరిగింది.

జలకళ బోర్లు ఎన్నివేశారు?

వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా బోర్లు వేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6వేల దరఖాస్తులు అందాయి. వీటిలో 373బోర్లు వేశాం. సంబంధిత కాంట్రాక్టర్‌ మధ్యలో వెనక్కి తగ్గడం వల్ల మిగిలిన రైతులకు వేయాల్సిన బోర్లు పెండింగ్‌లో వున్నాయి. ప్రభుత్వం నుంచి సంబంధిత కాంట్రాక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్టు తమ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

➡️