- మత్స్యకారులు క్షేమం
ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్, అచ్యుతాపురం విలేకరులు : అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో ఆదివారం మెకనైజ్డ్ బోటు ఇంజన్‌లో మంటలు చెలరేగి బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మత్స్యకారుల కథనం ప్రకారం.. బడే సూర్యనారాయణకు చెందిన మెకనైజ్డ్ బోటు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి శుక్రవారం వేటకు వెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలో వల వేసే సమయంలో ఒక్కసారిగా ఇంజన్ నుంచి మంటలు రావడంతో బోటులో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అవి ఎంతకీ ఆరకపోవడంతో వారంతా నీటిలోకి దూకారు. ఈదుకుంటూ వస్తుండగా అదే సమయానికి వేరొక బోటు తారసపడడంతో ఆ బోటు ఎక్కి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. అధికారులు, పోలీసులతో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారుల్లో జి ఎల్లాజీ, జి రాము, బి ధనరాజు, ఆర్ ఎర్రయ్య, గరికిన ఎల్లాజీ, పి వీరాస్వామి, సిహెచ్ నల్లోడు ఉన్నారు. రాష్ట్ర మరపడవల సంఘం ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు మీడియాతో మాట్లాడుతూ బోటు యజమానికి, మత్స్యకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. బోటు ఖరీదు సుమారు రూ.35 లక్షలు ఉంటుందని, అది కాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని, తక్షణం పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కేసును పూడిమడక మెరైన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మరపడవల సంఘం ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు మీడియాతో మాట్లాడుతూ … బోటు ఇంజన్‌లో మంటలు చెలరేగుతున్న సమయంలో ప్రమాదాన్ని పసిగట్టిన మత్స్యకారులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని సముద్రంలోకి దూకి ఈదుకుంటూ వస్తున్న సమయంలో శ్రీనివాసరావుకు చెందిన 683 నెంబర్ గల బోటు తారసపడటంతో వారంతా ఆ బోటు ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారన్నారు. బోటు ఓనర్ కు, మత్స్యకారులకు ప్రభుత్వం తగు న్యాయం చేయాలని కోరారు. కాలిపోయిన బోటుకు పరిహారం వెంటనే ఇవ్వాలని రాష్ట్ర మరపడవల సంఘం ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు అన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మత్స్యశాఖ, అధికారుల దఅష్టికి తీసుకువెళ్లిందని వివరించారు. బోటు ఖరీదు రూ.35 లక్షల నుండి రూ.36 లక్షలు ఉంటుందని, అది అగ్నికి ఆహుతి కావడం దురదఅష్టకరం అన్నారు. ప్రభుత్వ వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మరపడవల సంఘం ఉపాధ్యక్షులు గరికిన పరుశురాం, కార్యదర్సులు ఎస్.గురుప్రసాద్, మున్నం బాలాజీ 37వ వార్డు జనసేన అధ్యక్షులు గరికిన్ రవి, మద్దాడ భాను, తదితరులు పాల్గొన్నారు.