ప్రజాశక్తి-బాపట్ల : కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిదని వైసిపి బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. రైతుల సమస్యలపై వైసిపి నాయకులు కదం తొక్కారు. రైతుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతలకి పెట్టుబడి సాయం అందజేయాలని, కర్షకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేసీ ప్రఖర్ జైన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకూ ఆ హామీ నెరవేరలేదన్నారు. అన్నదాత సుఖీభవ ఆచూకీ లేకుండా పోయిందన్నారు. కూటమి పాలనలో రైతుల కష్టం దళారుల పాలవుతుంన్నారు. రైతులకు కన్నీరే మిగులుతుందన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర 75 కేజీల బస్తా ధర రూ. 1725 కాగా బాబు పాలనలో రూ. 1300 మించి గిట్టుబాటు కావడం లేదన్నారు. దీంతో బస్తాకు రూ.400 మేర రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారీలు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు. దీంతో దిక్కుతోచక స్థితిలో రైతులు అయినకాడికి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. అకాల వర్షాలకు నీట మునిగిన, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు అనేక ఆంక్షలు విధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. కూటమిపాలనలో నిర్వీర్యమైన ఆర్‌బికె వ్యవస్థకూటమి పాలనలో ఆర్‌బికె వ్యవస్థ నిర్వీర్యమైన దని మాజీ మంత్రి నాగార్జున తెలిపారు. రైతుల వద్దకే నేరెఉగా ప్రభుత్వ సేవలలు అందిస్తున్న గొప్ప వ్యవస్థ ఆర్‌బికెను చంద్రబాబు ప్రభుత్వం ఆచూకీ లేకుండా చేసిందన్నారు. రైతు సమస్యలు పట్టించుకోకపోతే పోరుబాట తప్పదని నాగార్జున హెచ్చరించారు. తొలుత పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకూ వైసిపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి బాపట్ల నియోజక వర్గ ఇన్‌ఛార్జి కోనా రఘుపతి , వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్ ఛార్జి పానెం చిన్న హనిమి రెడ్డి, వైసిపి రేపల్లె నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఈవూరు గణేష్, వైసిపి వేమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.