అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి
!ప్రజాశక్తి – వెల్దుర్తి : మాచర్ల నియోజకవర్గంలో గత ఐదేళ్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు వేల ఎకరాలను కబ్జా చేశారని, పలువుర్ని బెదిరించి ఆస్తులను రాయించుకున్నారని, ప్రజలు కోల్పోయిన ఆస్తులు, భూమలపై సమగ్ర విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజాదర్భార్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి, నకిలీ పాసు పుస్తకాలను సృష్టించి, రూ.వందల కోట్లు రుణాలను తీసుకుని బ్యాంకులను, రైతులను రామకృష్ణారెడి లూటీ చేశారని, కబ్జాకోరులను జైలుకు పంపి, రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు తెలియకుండా బ్యాంకు నుంచి పొదుపు డబ్బులు కాజేసిన యానిమేటర్లపై, వారి వెనకున్న వైసిపి నేతలపై కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతామన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు రాజేసి రాజకీయంగా లబ్ధి పొందేవారిని ఉపేక్షించబోమన్నారు. తాజాగా మాచర్ల పట్టణంలో రెండు సామాజిక తరగతుల మధ్య జరిగిన గొడవను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వైసిపి చూస్తోందన్నారు.
ఇదిలా ఉండగా ప్రజాదర్భార్‌లో ప్రజల నుంచి 50 కు పైగా వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. రెవెన్యూ, భూ కబ్జాలు, పింఛన్లు, సిఎం సహాయనిధి వంటివి రాగా వీటిపై అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజాదర్భార్ బాధితుల కోసమని, దీనికి కబ్జాకోరులు రావొద్దని అని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమంగా ఆస్తులు రాయించుకోవడం వంటి వాటిపై ప్రజా వినతులను స్వీకరించి, విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
తన వద్దకు వచ్చిన వారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
మీ కులాల మధ్య గొడవలేమైనా ఉన్నాయా?
ఘర్షణ పై హోం మంత్రి అడిగారు
ప్రజాశక్తి – మాచర్ల : ఇద్దరి మధ్య చిన్న వివాదాన్ని రెండు కులాల మధ్య ఘర్షణగా చేసి వీధుల్లో రాళ్లు, కర్రలతో స్వైర విహరం చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను శనివారం తనిఖీ చేసిన ఆయన్ను వివాదంలో ఒక పక్షానికి చెందిన వారు కలిసి తమ పిల్లలపై అన్యాయంగా కేసు పెట్టారని చెప్పారు. ఈ రెండు సామాజిక తరగతులకు గతంలో ఏమైనా ఘర్షణలున్నాయా? అని ఎమ్మెల్యే అడిగారు. ఎన్నికల సందర్భంలో కూడా ఇలాగే చిన్న గొడవలను కుల ఘర్షణలుగా మార్చి రాజకీయ లబ్ధి పొందడానికి గత నాయకులు ప్రయత్నించారని అన్నారు. మాచర్లలో మూడ్రోజుల క్రితం జరిగిన ఘర్షణపై హోం మంత్రి కూడా తనకు ఫోన్ చేసి వివరణ అడిగారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎవర్నీ తప్పుడు కేసుల్లో ఇరికించదంటూ అక్కడే ఉన్న పట్టణ సిఐ ప్రభాకర్‌ను పిలిచి ఘర్షణలకు పాల్పడిన ఎవర్నీ వదిలిపెట్టొద్దని చెప్పారు.
