పీలేరు ప్రభుత్వ ఐటిఐకి పక్కా భవనం నిర్మించాలి

Nov 29,2024 17:33 #annamayya, #peeleru

ప్రజాశక్తి-పీలేరు: పీలేరులోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలని ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ, డిబిఎస్ఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భాను ప్రకాష్ , ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రధాన ద్వారం ముందు విద్యార్థులతో వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పీలేరు నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో పీలేరులో ఏర్పాటైన ప్రభుత్వ ఐటిఐ కళాశాల కూడా ఒకటని అన్నారు. ప్రభుత్వ ఐటిఐ కళాశాల విద్యార్థులకు పక్కా భవనం లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వారు చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు భూమి కూడా సిద్ధంగా ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దాదాపు రూ.5 కోట్లు పక్కా భవన నిర్మాణానికి నిధులు కేటాయించిందని, తదుపరి ఏ కారణం చేతనో ఆ నిధులు రద్దయ్యాయని తెలిపారు. ప్రస్తుత పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వ ఐటిఐ కళాశాల పక్కా భవన నిర్మాణానికి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో అనేక విద్యాసంస్థలకు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహించాల్సి వస్తోందని, వాటికి కూడా పక్కా భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️