ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిసింది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 167 సహకార రికార్డుల కంప్యూటరీకరణ ఇటీవల చేపట్టారు. అంతేగాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పిఎసిఎస్) ప్రస్తుతం ఉన్న సభ్యుల వివరాలను అప్‌డేట్ చేయాలని, ప్రధానంగా ప్రతి రైతు చేత ఈకేవైసి చేయించి స్థానిక చిరునామాతో నిర్ధారణ చేయాలని ప్రభుత్వం సూచించింది. రూ.300 షేర్ ధనంతో సభ్యులుగా చేరు వారు స్థానికంగా పాస్‌బుక్, ఆధార్ కార్డు కలిగి ఉన్న చిరుమానాతో వివరాలు ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారు. కొత్త సభ్యుల చేరిక కూడా అవకాశం కల్పిస్తున్నారు. భూమి ఒకచోట ఉండి, నివాసం మరొక చోట ఉంటే భూమి ఉన్న ప్రాంతంలోని సొసైటీ అధికారి నుంచి తమ సొసైటీలో సభ్యత్వం లేదని ధ్రువీకరణ పొంది నివసిస్తున్న ప్రాంతంలోని సొసైటీలో సభ్యత్వం తీసుకోవచ్చునని అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. పొలం ఉన్న ప్రాంతంలో కంటే ఆధార్ కార్డులో చిరుమానా ఎక్కడ ఉంటే అక్కడి సొసైటీలోనే చేరేందుకు అనుమతిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2018లో కాలపరిమితి ముగియగా టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి అధ్యక్షులతో పాటు పాలక వర్గాల పదవీకాలాన్ని కొద్ది కాలం పొడిగించారు. ఎన్నికలను నిర్వహించలేదు. ఆ తరువాత ప్రత్యేక అధికారులు, పర్సన్ ఇన్‌ఛార్జిలను నియమించారు. 2019 మేలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎన్నికలు నిర్వహించలేదు. పర్సన్ ఇన్‌ఛార్జిలను నియమించలేదు. వైసిపికి చెందిన ముగ్గురు సభ్యులతో నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల హయాంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, నకిలీ రైతులు పేరుతో రుణాలు పొందారని కూడా జిల్లా వ్యాప్తంగా 13 కేసులు నమోదుయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక అధికారులతోనే పర్సన్ ఇన్‌ఛార్జిల నియమాకం చేశారు. గతంలో మాదిరిగా ముగ్గురు సభ్యులతో కమిటీలు ఇప్పుడు లేవు. అన్ని సహకార సంఘాల స్థాయిలో ప్రత్యేక అధికారులు పర్సన్ ఇన్‌ఛార్జిలను ఏర్పాటు చేశారు. ఆరు నెలల కాలపరిమితితో వీరిని నియమించారు. రానున్న ఆరు నెలల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. అంతేగాక సాంకేతికంగా అన్ని సహకార సంఘాల రికార్డులను కంప్యూటరీకరణ చేస్తున్నారు. పిఎసిఎస్‌లను మినీ వ్యాపార కేంద్రాలుగా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం సహకార సంఘాల్లో ఉన్న సభ్యులు, వారి వివరాలు, సంఘం పరిధిలోని రైతులు, వారికి అందిస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ కంప్యూటరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఇప్పటి వరకు మాన్యువల్‌గా జరుగుతున్న సేవలను ఇక మీదట కంప్యూటరీకరణ చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. రైతుసేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పరుగు మందులు, విత్తనాలు అందించడంతో పాటు ప్రతి సహకార సంఘంలో కామన్ సర్వీసు సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ అప్ డేషన్, ఈకేవైసి, వివిధ రకాల ప్రభుత్వ ధృవపత్రాల జారీ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి నిర్వహిస్తున్న సేవలన్నీ కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
