పెరిగిన దాహం కేకలు

Apr 17,2024 00:08

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు,పల్నాడు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఆరునెలలుగా సరైన వర్షాల్లేక చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి. తాగునీటికి గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో పోషకులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు పచ్చగడ్డి దొరక్క, కాల్వల్లో నీరు లేక ఎండ తీవ్రతతో పశువులను బయటకు తీసుకువెళ్లడానికి పశు పోషకులు చాలావరకు వెనకంజవేస్తున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడిపై ప్రజలు రోడెక్కుతున్నారు. ప్రత్తిపాడులో తాగునీటి కోసం వైసిపి పార్టీ ఆధ్వర్యంలోనే సోమవారం రాస్తారోకో జరిగింది. స్థానిక చెరువుకు నీరు రాలేదని అధికార పార్టీ కార్యకర్తలే రోడ్డుకి ఆందోళన చేశారు. నాదెండ్ల మండలం తర్లుపాడు మేజర్‌కు సాగర్‌ జలాలు రావడం లేదని రెండురోజుల క్రితం నాదెండ్ల వాసులు నరసరావుపేటలో ధర్నా చేశారు. నాదెండ్ల, అప్పాపురం, ఎండుగంపాలెం, గణపవరం, కనపర్తి, సాతులూరు చెరువులు పూర్తిగా ఏండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలో కాల్వలు ఆధునీకరణ చేయకపోవడం వల్ల తూటుకాడ, గుర్రపుడెక్క పెరిగిపోయి సాగర్‌ జలాలు ఇంతవరకు పెదనందిపాడు మండలానికి పూర్తిగా చేరలేదని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తాగునీటి వనరులను అభివృద్ధి చేయకపోవడం వల్ల జలజీవన్‌ మిషన్‌ పనులు పూర్తికాకపోవడంతో పెదనందిపాడు మండలంలో తాగునీటి సమస్య తీవ్రరగా ఉంది. మండలం పరిధిలోని 17 గ్రామాలకు గాను రెండు మూడు గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి పెరిగింది. సాగర్‌ జలాలను విడుదల చేసి వారం దాటినా ఇంత వరకు పెదనందిపాడు మండలంలోని పలు చెరువులకు పూర్తిగా నీరు రాలేదు. మొత్తంగా పల్నాడు జిల్లాలో 200 గ్రామాల్లో, గుంటూరు జిల్లాలో 100 గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. నాగార్జున సాగర్‌ జలాశయం ద్వారా కాల్వలకు ఈనెల 8వ తేదీ నుంచి రోజు 5500 క్యూసెక్కుల నీటిని ఈనెల 18 వరకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుడికాల్వ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని అధికారులు అందరూ తమ పరిధిలో 461 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు తాగునీరు నింపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాపశ్చిమ డెల్టాలో 65 చెరువులకు నీరు చేరినట్టు అధికారులు చెబుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో నీరు చేరలేదని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. చిలకలూరిపేటలో చెరువుకు పూర్తి స్థాయిలో నీరు రాకపోవడం వల్ల పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. చిలకలూరిపేట, వినుకొండ, ప్రత్తిపాడు, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి గ్రామాల్లోని బోర్లు కూడా పనిచేయడం లేదు. మరోవైపు నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాల్లోనీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. పులిచింతల జలాశయంలో గరిష్టనీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా మంగళవార ం ాత్రి కేవలం 4.99 టీఎంసీలకు నీటి నిల్వ మాత్రమే ఉంది. సాగర్‌ జలాశయం నుంచి 31,435 క్యూసెక్కులు వస్తుండగా 3821 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజి నుంచి కాల్వల ద్వారా చెరువులను నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాది ఇదే రోజుల్లో పులిచింతలలో నీటి నిల్వ 20 టీఎంసీల నిల్వ ఉండగా ఈ ఏడాది ప్రస్తుతం 4.99 టీఎంసీలే ఉంది. నాగార్జున సాగర్‌లో గరిష్ట నీటినిల్వ 312.01 టీఎంసిలుకాగా ప్రస్తుతం 129.84 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. మొత్తంగా ప్రధాన జలాశయాల్లో కనీస నీటి నిల్వలు లేకుండాపోతున్నాయి. పులిచింతలలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోయి అడుగంటే పరిస్థితి నెలకొంది. పులిచింతలలో నీటినిల్వ బాగా తగ్గిపోవడం వల్ల ప్రకాశం బ్యారేజి వద్ద కూడా నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయింది. ప్రతిఏటా మే లో నీటిఎద్దడి వస్తుందని, కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో సమస్య తీవ్రరూపం దాల్చింది.

➡️