కేంద్ర పథకాల అమలుతో రక్తహీనత తగ్గుదల

Mar 21,2025 20:32

జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం అంచనా

కలెక్టర్‌కు వివరించిన కేంద్ర బృందం

ప్రజాశక్తి-విజయనగరం : కేంద్ర ప్రభుత్వం రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పలు పథకాలను క్షేత్రస్థాయిలో సమర్ధంగా అమలు చేస్తున్న కారణంగానే జిల్లాలో రక్తహీనత తగ్గిందని జిల్లాలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఈ మేరకు రెండు రోజులుగా రక్తహీనత తగ్గడానికి గల కారణాలపై అధ్యయనం చేసిన కేంద్ర బృందం ప్రతినిధులు ఐఎవిఎ- ఇండియా సంస్థ ఆరోగ్య వ్యవస్థ విధాన పరిశోధనకు చెందిన సీనియర్‌ మేనేజర్‌ డాక్టర్‌ దృష్టి శర్మ, ప్రత్యేక నిపుణులు డాక్టర్‌ జాస్మిన్‌ శుక్రవారం కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ను కలసి తమ పర్యటన ఉద్దేశ్యాన్ని, జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత గుర్తించిన అంశాలను వివరించారు. రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తమ బృందం రెండు రోజులపాటు అధ్యయనం చేసిందని వారు తెలిపారు. రక్తహీనత తొలగించడంలో ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎనిమీయా ముక్త్‌ భారత్‌, ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ, ఆర్‌బిఎస్‌కె, ఉపాధిహామీ, జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం, సమగ్రశిక్ష, ఆర్‌ఎంఎస్‌ఎ, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్‌భారత్‌ అభియాన్‌ దోహదపడినట్లు గుర్తించామని కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలోని పూసపాటి రేగ మండలంలో పర్యటించి గర్భిణీలు, ఎఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, కౌమార బాలికలతో మాట్లాడామని వారు వివరించారు.కేంద్ర పథకాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా లభించే పోషకాలు అందించడం, అదనపు పోషకాహారాన్ని అందించడం, స్థానిక పరిస్థితులకు తగిన ఆహారాన్ని అందించిన కారణంగా రక్తహీనత తగ్గిందని గుర్తించామన్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన ప్రజల అవసరాలు తీర్చడం కోసం రోడ్లతో అనుసంధానం, విద్యుత్‌, జీవనోపాధి కల్పించడం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ద్వారా వారిలోనూ రక్తహీనత తగ్గించడం సాధ్యమైందని గుర్తించామన్నారు. 12 జిల్లాల్లో రక్తహీనత తగ్గుదలకు గల కారణాలపై అధ్యయనం చేస్తున్నట్టు వారు తెలిపారు. డిఎంహెచ్‌ఒ జీవనరాణి కూడా బృందంతో పాటు జిల్లా కలెక్టర్‌ను కలిశారు.

➡️