బస్సులు ఎక్కేందుకు ఇక్కట్లు
తిరుగు ప్రయాణంలో కష్టాలు
ప్రజాశక్తి-విజయనగరం కోట : సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు, వలస కార్మికులు తిరుగుముఖం పట్టడంతో సోమవారం ఆర్‌టిసి కాంప్లెక్సు జనసంద్రంగా మారింది. ప్రధానంగా విజయనగరం, విశాఖనగరాల్లో హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులంతా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు పయనమవ్వడంతో ఆర్‌టిసి కాంప్లెక్సు కిటకిటలాడింది. ఉదయం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు తమ పుస్తకాల బ్యాగులు, లగేజీలతో రావడంతో కాంప్లెక్స్ అంతా కిక్కిరిసిపోయింది. బస్సులను ఎక్కడానికి ఉరుకులు పరుగులతో బస్సులు కాంప్లెక్స్ పాయింట్ వద్దకు వస్తుండగానే పరిగెడుతూ సీట్లు కోసం ఒకరు ఒకరు తోసుకుంటూ కనిపించారు. ఆర్‌టిసి సిబ్బంది డిపిటిఒ, డిపో మేనేజర్, సిఐ తదితరులు కాంప్లెక్స్ లో ఉండి ఎవరు ఏ రూట్ వెళ్లాలో తెలుసుకుని సూచనలు చేశారు. పిల్లలతో వచ్చిన పలు కుటుంబాలను ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి బస్సులో ఎక్కించారు.