కలగా మిగిలిన మినీ రిజర్వాయర్‌

Jun 9,2024 22:12

ప్రజాశక్తి – వీరఘట్టం : చిన్న నీటి వనరులు… పేరులోనే చిన్న ఉన్నప్పటికీ… వాటిని స్వదినియోగం చేసుకుంటే భారీగా ప్రయోజనాలు పొందవచ్చు. భూసేకరణ, అటవీ పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా తక్కువ సమయం అతి తక్కువ వ్యయంతో సులువుగా నిర్వహణ చేసుకోవడానికి వీలున్న చిన్ననీటి వనరులే కానీ వాటిపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కొనసాగిస్తుంది. మండలంలోని కె.ఇచ్చాపురం పంచాయతీ పరిధిలో ఈతకొండ-ఎండ కొండ గిరిజన గ్రామాల మధ్య మినీ రిజర్వాయర్‌ సుమారు రూ.నాలుగు కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు అప్పట్లో పరిశీలన చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ పనులు ప్రారంభించకపోవడంతో 2వేల ఎకరాలకు సాగునీటికి ప్రశ్నార్థకంగా మారింది. వీరఘట్టం మేజర్‌ పంచాయతీ పరిధిలోని అచ్చపువలస గిరిజన గ్రామం నుండి సీతంపేట మండలం బర్న గిరిజన గ్రామం వరకు కొండ పక్కన ఉన్న భూములకు మినీ రిజర్వాయర్‌ పూర్తయితే అక్కడ భూములన్నీ సస్యశ్యామలమవుతాయి. ఏడాదికి రెండు పంటలు కూడా పండించుకోవచ్చునని నాలుగు దశబ్దాల పైబడి ఇక్కడ మినీ రిజర్వాయర్‌ నిర్మించేందుకు అప్పట్లో మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిమిత్తం విశాఖపట్నంకు పంపించారు. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ పనులు చేపట్టకపోవడంతో పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్లతోనే సాగు ప్రస్తుత కాలంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పంటలకు నీరు సరిపోకపోవడంతో చేసేదేమీ లేక అవకాశమున్న రైతులు తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ ద్వారా వస్తున్న సాగునీటిను మోటార్ల సహాయంతో పొలాలకు మళ్లించి పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవకాశం లేని రైతులు వర్షాలపై ఆధారపడి పంటల సాగు చేస్తున్నప్పటికీ కళ్లముందే పంటలు నాశనం కావడంతో పంటపై పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలంటూ నీలంపేట, గదబవలస, హుస్సేనపురం, వంకాయలగెడ్డ తదితర గ్రామాలకు చెందిన కె.సరోజిని, నారాయణపురం నీలం శెట్టి, వాసు, భోగమ్మ, పి.గౌరమ్మ, సుందరమ్మ, పుష్ప, టి.శాంతమ్మ, సావిత్రమ్మ, ఆర్‌.తాతబాబు, దాలమ్మ, జి.పెద్ద సీతయ్య తదితర అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటకు సాగు నీరందక చేతికి అంది వచ్చి తరుణంలో కళ్ల ముందే పంటలు ఎండిపోవడంతో వాటిని చూసిన అన్నదాతలు కంటతడి పెట్టారు. రైతులను రాజులుగా చేస్తామని పాలకులు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారే తప్ప రైతులకు కనీస అవసరమై సాగునీటి సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ ప్రాంత అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు అన్నదాతలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి వనరులు నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత అన్నదాతలు కోరుతున్నారు.

➡️