కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి

కలెక్టరేట్‌ (అనంతపురం) : తన భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ సోమవారం ఉదయం అనంతపురం కలెక్టరేట్లో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఈ రైతు మంగళవారం ఉదయం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి….. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణకు బుదేడు వద్ద 1. 54 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి తనకు పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు చేయాలని పలుమార్లు రైతు మండల, జిల్లా రెవిన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే సమస్యపై సోమవారం నాడు కలెక్టరేట్లో కలెక్టరుకు విజ్ఞప్తి ఇచ్చేందుకు రైతు సూర్యనారాయణ అనంతపురం కలెక్టరేట్‌ వద్దకు వచ్చాడు. అక్కడ కూడా తనకు న్యాయం జరగదన్న మనస్థాపనతో కలెక్టర్‌ కార్యాలయంలోనే ఆయన పురుగుల మందు తాగాడు. వెంటనే అక్కడున్నవారు స్పందించి అతన్ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం రైతు మరణించాడు.

కుటుంబ సభ్యుల ఆందోళన
సూర్యనారాయణ మృతికి అధికారులే కారణం అంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకం సమస్యను పరిష్కరించాలని ఎన్నిమార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఎవరూ పట్టించుకోలేదని, అందువల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆసుపత్రి వద్ద కన్నీటి పర్యవంతమయ్యారు. సోమవారం నాడు కలెక్టరేట్లో ఆయన ఆత్మహత్యయత్నం చేసినా తమకు సమాచారం సాయంత్రం వరకు ఎవరూ ఇవ్వలేదని సరైన చికిత్స అందించకపోవడం వల్ల మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు . అధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధిత కుటుంబ సభ్యులు తెలియజేశారు.

➡️