ప్రజాశక్తి-సీతమ్మధార : పోర్టు హాస్పిటల్‌ను రక్షించుకునేవరకూ పోరాటం కొనసాగుతుందని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ స్పష్టంచేశారు. పోర్టు హాస్పిటల్ ప్రయివేటీకరణ ఆపాలని సిఐటియు ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం నాటికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షను ఆర్‌కెఎస్‌వి.కుమార్ ప్రారంభించి మాట్లాడారు. విశాఖపట్నం అభివృద్ధికి పోర్టు ప్రధాన కారణమన్నారు. పోర్టు వద్ద రూ.వేల కోట్లు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయని తెలిపారు. వాటితో హాస్పిటల్‌ను నిర్వహించాలని డిమాండ్‌చేశారు. దీనిపై జిల్లాలో ఉన్న అన్ని సంఘాల మద్దతు కూడగట్టి పోరాడతామన్నారు. వైజాగ్ పోర్టు రూ.386 కోట్లు లాభాలతో నడుస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రూ.171.42 కోట్లు వివిధ పన్నుల రూపంలో చెల్లిస్తుందని వివరించారు. ఇంతటి అభివృద్ధిలో కార్మికుల కృషి ఉందని, అటువంటి కార్మికులకు వైద్యం అందించే హాస్పిటల్‌ను ప్రయివేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ దీక్షలో జె.సత్యనారాయణ, కె.సత్యనారాయణ, ఈశ్వరరావు, శ్రీను, బి.జగన్, కనకారావు, అప్పలనర్సమ్మ, ధనలక్ష్మి, పైడమ్మ, విఎన్.మూర్తి, బి.జగన్, సూర్యనారాయణ పాల్గొన్నారు.
