షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం -కాలి బూడిదైన ఇంటిలోని ఎలక్ట్రానిక్‌ సామగ్రి

ప్రజాశక్తి-మదనపల్లె అర్భన్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంటిలోని ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఖాళీ బూడిదయ్యాయి. ఈ సంఘ టన శనివారం మదనపల్లె పట్టణంలో జరిగింది. అగ్ని మాపక అధికారి శివప్ప తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్‌ రెండవ క్రాస్‌లో నివాసం ఉంటున్న ప్రమీల ఇంటిలో ఉదయం ఉన్నట్లుండి మంటలు చెలరే గాయని చెప్పారు. ఇంట్లో నిద్రిస్తున్న ప్రమీల కుటుంబీకులు గట్టిగా కేకలు వేస్తూ బయటికి పరుగులు పెట్టారని అన్నారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందివ్వడంతో ఫైర్‌ ఇంజన్‌ తీసుకొని వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసి పూర్తిగా అదుపు చేశామని అన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష విలువచేసే ఫ్రిడ్జ్‌, వంట సామగ్రి, ఇతర వస్తువులు కాలిపోయాయని అన్నారు. ఈ మేరకు అగ్ని ప్రమాదాలనుంచి ఎలా బయటపడాలని అక్కడి స్థానికులకు అధికారి శివప్ప తెలిపారు. రెండో పట్టణ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

➡️