చేజారిన చేయూత.?

Jun 10,2024 21:16

ప్రజాశక్తి- శృంగవరపుకోట : జిల్లాలో ఇంకా కొంత మంది మహిళల ఖాతాల్లో చేయూత రూ.18,750లు జమకాకపోవడంతో చేజారినట్లేనని మహిళలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఏడాది వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి సంబంధించి వైసిపి ప్రభుత్వం నాలుగవ విడతలో భాగంగా రూ.5,060 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ రూ.2,113 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.2,947 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దీంతో కొద్దిమంది మహిళల ఖాతాల్లో మాత్రమే నగదు జమ కావడంతో ఇంకా తమ ఖాతాల్లో నగదు జమ కాని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం నిధులు పూర్తిగా జమ కాకుండా ఉంటే పరవాలేదని కొంతమంది మహిళలకు వారి ఖాతాల్లో డబ్బులు జమై మిగిలిన వారికి కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళ సాధికారిక పేరుతో గత వైసిపి ప్రభుత్వం 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు మహిళ లకు అందించిన చేయూత 4వ విడత డబ్బులు 30శాతం మంది మహిళల ఖాతాల్లో మాత్రమే జమయ్యాయి. ఎన్నికల కు నెల రోజులు ముందుగా జగన్మోహన్‌ రెడ్డి చేయూతకు సంబంధించి బటన్‌ నొక్కినప్పటికీ ఎన్నికల దగ్గర్లో మహిళల ఖాతాలో డబ్బులు వేయవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ రావడంతో చాలా మందికి డబ్బులు అందలేదు. మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తుందని తరువా తైనా తమ డబ్బులు తమ ఖాతాల్లో వేస్తారని చాలా మంది మహిళలు ఆశపడినా వైసిపి ఓటమి చెందడంతో నిరాశ చెందారు. బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో చేయూత డబ్బులు విడుదల కానట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో మహిళలు ఉన్నకాడికి ఆశలు వదిలేసుకున్నారు.

➡️