ప్రజాశక్తి-పుల్లంపేట మండల పరిధిలోని ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడితో కూడిన విద్యా బోధనతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బండెడు పుస్తకాలతో కుస్తీ పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నారు. కేజీల కేజీల బరువైన పుస్తకాలను మోస్తూ పాఠశాల విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కునేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బడి పుస్తకాలను మోయడం వల్ల వేలాదిమంది పిల్లల ఎదుగుదల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు గగ్గోలు పెడుతున్నారు. ప్రయివేట్ పాఠశాలలో పుస్తకాల భారం ఎక్కువగా ఉంటుంది. సర్కారు బడులను మినహాయిస్తే ప్రయివేట్ పాఠ శాలలో చదువుతున్న విద్యార్థుల స్కూలు బ్యాగుల అధిక బరువు ఉంటుంది. టెక్నాలజీ రోజురోజుకు అభివద్ధి చెందుతున్నా విద్యా విధానంలో మార్పులు కాన రావడం లేదు. చదువుల భారంతో పుస్తకాల బరువుతో విద్యార్థులు సత మత మవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్ని ఎక్కువ పుస్తకాలు ఉంటే అంత బాగా చదువుతారని పరిస్థితిలోకి ఆయా విద్యాసంస్థల ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమ వ్యాపార స్వలాభం కోసం అవసరానికి మించి పలు ప్రయివేట్ విద్యాసంస్థలు భారీగా పుస్తకాలను కొనుగోలు చేస్తున్నాయి. వాటి ధరలను విపరీతంగా పెంచి విక్రయాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఎనిమిది నుంచి పదవ తరగతి చదివే ఆరోగ్యకరమైన చిన్నారి బరువు 25 నుండి 35 కేజీలు ఉంటుంది. ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు 10 నుంచి 15 కేజీల బరువు ఉన్న పుస్తకాల బ్యాగులను మోసుకుంటూ వెళుతున్నారు. నిబంధనలు ప్రకారం ఒకటవ తరగతి విద్యార్థి 750 గ్రాములు, రెండవ తరగతి 2 కేజీలు, 3,4 తరగతుల పిల్లలు మూడు కేజీలు, 5వ తరగతి నాలుగు కేజీలు లు, 6వ తరగతి ఆరు కేజీలు, 7వతరగతి ఎనిమిది కేజీలు, 8వ తరగతి పది కేజీలు, 9,10 వ తరగతి విద్యార్థులు 12 కేజీలు మాత్రమే బరువు మోయాల్సి ఉంది. ఈ నిబంధనలకు భిన్నంగా రెట్టింపు బరువు మోస్తున్నారు. ఆయా స్కూల్ బ్యాగులను మోస్తున్న విద్యార్థులు చిన్న వయసులోనే నడుము మోకాళ్ళ నొప్పులు ఇతరత్రా ఆర్థోపెడిక్ సమ స్యలతో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. స్కూలు బ్యాగుల బరువును తగ్గించాలని భావించిన ప్రభుత్వం గతంలో ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ వీటిని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. బరువులు పిల్లల ఎదుగుదల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తుందని యూనిసెఫ్‌తో పాటు వివిధ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠ శాలలో కంటే ప్రయివేట్ స్కూళ్లలోనే పుస్తకాల బరువు అధికంగా ఉంటుంది. క్లాస్ ఫెయిర్ వర్క్ కోసం ప్రత్యేకంగా వేర్వేరు నోటుపుస్తకాలు ప్రతిరోజూ తెప్పి స్తున్నారు. ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేని పుస్తకాలను భద్ర పరుచు కునేందుకు తరగతి గదుల్లో అల్మారాలు రేకులను ఏర్పాటు చేస్తే విద్యా ర్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. కానీ ఏ ఒక్క పాఠశాలల్లోనూ ఈ ఏర్పా ట్లు లేవు. కొన్ని పాఠశా లలు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటంతో మోత బరువుతో మెట్లు ఎక్కుతున్న విద్యార్థులు వెన్ను మోకాళ్ళ నొప్పులతో సత మతమవుతున్నారు. శక్తికి మించి బరువు మోయటంతో వారి ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది.పిల్లల ఆరోగ్యంపై దృష్టిపై వారిపై అధికభారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
