పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు

ప్రజాశక్తి-వేటపాలెం: పందిళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. పది రోజుల వ్యవధిలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన డెంగ్యూ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ సచివాలయం-3 రైల్వే గేటు వెనుక ఉన్న విఘ్నేశ్వర కాలనీకి చెందిన పి వెంకట దుర్గాప్రసాద్‌ అనే పదహారేళ్ల బాలుడు వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. మందులు వాడినప్పటికీ ఎంతకీ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు గుంటూరు వైద్యశాలలో చేర్పించి పరీక్షల నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలలో డెంగ్యూ జ్వరంగా గుర్తించి స్థానిక వైద్యశాలకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బుధవారం ఆ కాలనీలో పంచాయతీ సెక్రటరీ ఎం శ్రీనివాసరావుకు సమాచారం అందించి శానిటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. సుమారు పది రోజుల క్రితం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ కటారిపాలేనికి చెందిన కటారి దివ్య అనే 22 సంవత్సరాల యువతి పది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు నిర్వహించడంతో డెంగ్యూ జ్వరంగా గుర్తించారు. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌ హాస్పటల్‌కు తరలించారు. డెంగ్యూ కేసులు నమోదు అవ్వటానికి స్థానిక వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యమా లేక పంచాయతీ సిబ్బంది అలసత్వమా తెలియటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు కలుగజేసుకొని భవిష్యత్తులో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️