ఆడబిడ్డను కన్నదని అదనపు కట్నం వేధింపు – ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత

ప్రజాశక్తి-కుప్పం రూరల్‌ (చిత్తూరు) : ఆడబిడ్డకు జన్మనిచ్చిన కారణంగా అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుప్పం మండలం కూర్మానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుర్మానిపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మికి, పైనాసి గ్రామానికి చెందిన సంతోష్‌ తో గత 17 నెలల క్రితం వివాహం జరిగిందని బాధితురాలి తల్లి తెలిపారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురం తన కుమార్తె ఆడబిడ్డకు జన్మనిచ్చిన నాటి నుండి విషాదంగా మారిందన్నారు. తన కుమార్తెను తన భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఆడబిడ్డకు జన్మనిచ్చిన ధనలక్ష్మిని ఏలుకోవాలంటే 25 లక్షల రూపాయలు కావాలని తన అల్లుడు సంతోష్‌ డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై పెద్దల ముందు పంచాయతీ నిర్వహించగా, ఈ పంచాయతీలో సంతోష్‌ తన భార్యపై, అత్తపై అభాండాలు మోపుతూ దూషించడంతో అవమానాన్ని భరించలేక తన కుమార్తె విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్టు తెలిపారు. వెంటనే బాధితురాలిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి తరలించామని, బాధితురాలు తమిళనాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుందని బాధితురాలి తల్లి తెలిపారు. ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తూ పోలీసులను ఆశ్రయించామని, పోలీసులు ఈ విషయమై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి వేడుకున్నారు.

➡️