నంద్యాల విజజై బాబు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల పట్టణం శ్రీనివాస్‌ నగర్‌ లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌ పైన ఉన్న విజజై బాబు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఐసీయూ లో షార్ట్‌ సర్క్యూట్‌ వలన మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న రెండు అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పి పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఐసీయూ లో చికిత్స పొందుతున్న ముగ్గురు రోగులకు గాయాలయ్యాయి. వారితోపాటు ఆసుపత్రిలోని రోగులను ఇతర ప్రయివేటు ఆసుపత్రులకు అంబులెన్సుల ద్వారా పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ హుటాహుటిన బయలుదేరి అగ్ని ప్రమాదం జరిగిన ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ వి జైబాబుని అడిగి తెలుసుకున్నారు.

రోగులకు ఇబ్బంది లేకుండా చూడండి : ఎంపీ డా.బైరెడ్డి శబరి
నంద్యాల పట్టణం శ్రీనివాస్‌ నగర్‌ లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌ పైన విజైబాబు ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం పై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అరా తీశారు. నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి నంద్యాలలోని డాక్టర్‌ విజైబాబును ఫోన్‌ లో పరమార్శించి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

➡️