ప్రజాశక్తి-సీతమ్మధార : నరేంద్ర గర్ ప్రధాన గెడ్డలో ప్రజలు వ్యర్థాలు వేయకుండా ఇరువైపులా మెస్‌ను ఏర్పాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జివిఎంసి 43వ వార్డు పరిధిలోని నరేంద్రనగర్, ఎంఎస్‌ఎఫ్-5, తాటి చెట్ల పాలెం హైవే వద్ద ఉన్న అన్న క్యాంటీన్ తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. నరేంద్ర నగర్ గెడ్డకు మెస్ ఏర్పాటు, వీధిలో ఉన్న ఐరన్ బ్రిడ్జి తొలగించి ఆర్‌సిసి బ్రిడ్జి నిర్మాణం, పలు వీధుల్లో విద్యుత్ దీపాలతో కూడిన ఎలక్ట్రికల్ పోల్స్‌ను ఏర్పాటుచేయాలని కమిషనర్‌ను వార్డు కార్పొరేటర్ కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ఈ ప్రతిపాదనలను పరిశీలించాలని పర్యవేక్షక ఇంజనీర్‌ను ఆదేశించారు. కాలనీలో పలు చోట్ల విద్యుత్ దీపాలతో కూడిన ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఎందుకు చేయలేదని ఎమినిటీస్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ పోల్స్, వీధిలైట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డులో అస్తవ్యస్తంగా వున్న కేబుల్, విద్యుత్ వైర్లును గుర్తించి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా కేబుల్ ఆపరేటర్ల యాజమాన్యంతో మాట్లాడి క్రమబద్ధీకరించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రిని ఆదేశించారు. వార్డులో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, గెడ్డలు, కాలువలలో వ్యర్ధాలు తొలగింపు తదితర చర్యలు చేపట్టడంతో పాటు నిత్యం పర్యవేక్షించాలని ఎఎమ్‌ఒహెచ్ డాక్టర్ సునీల్ కుమార్‌ను కమిషనరు ఆదేశించారు. అనంతరం తాటిచెట్లపాలెం వద్ద ఉన్న ఎంఎస్‌ఎఫ్ -5ను పరిశీలించారు. వ్యర్థాలు నిలవలేకుండా డంపింగ్ యార్డ్ కు తరలించాలని జోనల్ కమిషనర్ బి.రామును ఆదేశించారు. సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. జోన్ పరిధిలోని ఉన్న అన్ని అన్న క్యాంటీన్లను నిత్యం పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ పర్యటనలో జివిఎంసి కార్యనిర్వహక ఇంజినీర్లు మురళీకృష్ణ, తారా ప్రసన్న, శానిటరీ సూపర్‌వైజర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
